logo

Hyderabad: జ్ఞాపక శక్తి కోల్పోయిన భర్త.. రూ.2కోట్ల ఆస్తిని అమ్మేశాడు!

భర్తకు శస్త్రచికిత్స జరిగి జ్ఞాపక శక్తి కోల్పోగా.. రూ.2 కోట్ల ఆస్తిని ఓ మహిళకు విక్రయించారని భార్య కోర్టును ఆశ్రయించగా.. భర్తపై కేసు నమోదు చేసిన ఘటన ఇది. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 12 Aug 2022 09:01 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: భర్తకు శస్త్రచికిత్స జరిగి జ్ఞాపక శక్తి కోల్పోగా.. రూ.2 కోట్ల ఆస్తిని ఓ మహిళకు విక్రయించారని భార్య కోర్టును ఆశ్రయించడంతో భర్తపై కేసు నమోదు చేసిన ఘటన ఇది. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ సౌభాగ్య కాలనీలో నివసించే ఐనాల వెంకట రాంప్రసాద్‌ కంప్యూటర్‌ ఇంజినీరుగా పనిచేసేవారు. ఆయనకు భార్య వాసవి, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం రాంప్రసాద్‌ తీవ్రమైన తలనొప్పితో నిమ్స్‌లో చేరారు. వైద్యులు పరిక్షించి ట్రానిటనీ వెంటిలేటర్‌ అసోసియేటెడ్‌ నిమోనియాగా గుర్తించి శస్త్రచికిత్స చేశారు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత జ్ఞాపకశక్తి కోల్పోయారు. అప్పటికే ఆయన తల్లిదండ్రులు చనిపోయారు. ఉద్యోగం కోల్పోయారు. 2017లో ఇంటి నుంచి వెంకటరాంప్రసాద్‌ అదృశ్యమయ్యారు.

అప్పట్లో భార్య పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెదికి పట్టుకొని అప్పగించారు. ఆ తర్వాత ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, ఇటీవల మదీనాగూడలోని బీహెచ్‌ఈఎల్‌-హెచ్‌ఐజీ ఫేజ్‌ 3లో ఉన్న తమ ఇంటిని ఆయన పద్మ అనే మహిళకు విక్రయించినట్లు భార్య గుర్తించింది. దాదాపు రెండు కోట్ల విలువైన ఈ ఆస్తి విక్రయానికి సంబంధించి భర్త ఖాతాలో ఎలాంటి డబ్బులు జమకాలేదని, దస్తావేజుల్లో రూ.50లక్షలకు విక్రయించినట్లు తెలుసుకున్నారు. న్యాయం చేయాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు వెంకటరాంప్రసాద్‌పై మెంటల్‌ హెల్త్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని