logo
Updated : 12 Aug 2022 05:29 IST

గుంతలమయం.. పట్టు తప్పితే ప్రమాదం

వర్షాలకు 100 కి.మీపైగా దెబ్బతిన్న రోడ్లు

రూ.9కోట్లతో మరమ్మతులకు ప్రతిపాదనలు

న్యూస్‌టుడే, పరిగి  : అసలే జిల్లా రోడ్లు అంతంత మాత్రం. ఏడాదికి పైగా మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి. దీనికి తోడు నిధుల కొరత. ఇలాంటి సమయంలో ఎడతెరిపి లేని వర్షాలు.. ఫలితంగా వాటి రూపురేఖలే మారిపోయాయి. అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు అడుగులోతు గుంతలుగా మారాయి. ఏ మాత్రం ఆదమరిచినా ప్రాణం మీదకు వచ్చినట్లే... ఎక్కడో ఓచోట నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహన చోదకులు బిక్కుబిక్కుమూంటూ నడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

నిధులు ఇస్తేనే...

జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాలున్నాయి. వీటిలో ప్రధానంగా పరిగి, కొడంగల్‌, వికారాబాద్‌ పరిధిలో రోడ్లు, భవనాల శాఖ ఆధీనంలో ఉండగా సుమాఉ 400 కిలోమీటర్ల మేరకు రోడ్ల పొడవు ఉంది. ఒక్క పరిగి, కొడంగల్‌ నియోజకవర్గంలోనే సుమారు 40 కిలోమీటర్ల దూరం వరకు వర్షాలకు పాడయ్యాయి. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో 432 రోడ్లు ఉండగా సుమారు 961కిలోమీటర్ల దూరం రోడ్లు ఉన్నాయి. వీటిలో 60 కిలోమీటర్ల మేరకు బాగు చేయాల్సి ఉంది. ఇలాంటి సయయంలో తగినన్ని నిధులు విడుదల చేసి ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు. ఒక్క కుల్కచర్ల మండలంలోనే 20 పీఆర్‌ రోడ్లు 42కి.మీ పాడైంది.

తక్కువ ఎత్తు కావడంతో..

పరిగి - వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై పరిగి సమీపాన వాగు ఉంది. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఇది ప్రస్తుతం చాలా వరకు పాడైంది. రోడ్డు కంటే చాలా తక్కువ ఎత్తులో ఉండటంతో చిన్నపాటి వర్షం కురిసినా వరద ఉద్ధృతికి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. ఇటీవల వర్షాలకు రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొంది.  

* బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాల పరిధిలోని రోడ్లు పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి.

* పరిగి -నస్కల్‌ గ్రామాల మధ్య వంతెన వద్ద అప్రోచ్‌రోడ్డు గుంతల మయంగా మారింది.

* వికారాబాద్‌ మండల పరిధి గ్రామాల్లో గుంతలతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు.

* కుల్కచర్ల మండలం అంతారం సమీపం నుంచి గాధిర్యాల్‌ వరకు అప్రోచ్‌రోడ్డు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. పుట్టపాహడ్‌ గ్రామం వద్ద రోడ్డు చిన్నపాటి కుంటను తలపిస్తోంది.

* పరిగి -షాద్‌నగర్‌ రోడ్డులో పరిగి సమీపం నుంచి తొండపల్లి వరకు తారు రోడ్డు పనికి రాకుండా పోయింది. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు పోయే విధంగా ఉన్నాయి. రెండు నెలల క్రితం తొండపల్లి సమీపాన గుంతలను తప్పించబోయి భార్య మృతి చెందడంతో భర్తకు గాయాలయ్యాయి. ఇదే రోడ్డులో సయ్యద్‌ మల్కాపూర్‌ వద్ద గురువారం ఓ లారీ డ్రైవర్‌ గుంతలను తప్పించబోయి కారును ఢీకొంది. తృటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు.

* పరిగి నుంచి లఖ్నాపూర్‌ ఆరు కిలోమీటర్ల రోడ్డు అద్వానంగా మారింది. నర్సయ్యగూడ రోడ్డు దారుణంగా మారింది. పరిగి నుంచి కాళ్లాపూర్‌ వరకు ఐదు కిలోమీటర్ల దూరం కూడా రోడ్డు చాలా ప్రాంతాల్లో గుంతలు పడింది.  

* పూడూరు మండలం చన్గోముల్‌ నుంచి మన్నెగూడ వరకు ఉన్న నాలుగు కిలోమీటర్ల దూరం వర్షాలకు గుంతలుగా తయారయ్యాయి.

* గట్టుపల్లి నుంచి నిజాంపేట్‌ మేడిపల్లి గేట్‌ వరకు 2.8కి.మీ మరమ్మతు పనులు చేపట్టాలి.

* కొడంగల్‌ నుంచి ఉడుమేశ్వరం, ఎరన్‌పల్లి వరకు ఆరు కిలోమీటర్ల మేర, హస్నాబాద్‌ వరకు దాదాపు 8కి.మీ. అన్నిచోట్లా గుంతలు పడ్డాయి.  


ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం
- సుదర్శన్‌రెడ్డి, ఉమేష్‌కుమార్‌, సురేందర్‌, డీఈఈలు, పంచాయతీరాజ్‌, రోడ్లు, భవనాల శాఖ

దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనుల కోసం ప్రభుత్వానికి రూ.9 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. పరిగి సమీపాన వాగుపై వంతెన నిర్మాణానికి గతంలోనే రూ.5కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కావాల్సి ఉంది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని