logo
Updated : 12 Aug 2022 10:06 IST

చరిత పుటలో చెరగని సంతకం.. సెప్టెంబరు 17

ఈనాడు, హైదరాబాద్‌: దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.. ఐదు వందలకుపైగా సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యాయి. హైదరాబాద్‌ స్టేట్‌ను పాలిస్తున్న నిజాం మాత్రం స్వతంత్ర రాజ్యంగా ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. మరోవైపు  రజాకార్ల పేరుతో కాసీం రజ్వీ అరాచకాలు పెరిగాయి. భూస్వాముల పెత్తందారితనానికి వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం తీవ్రమైంది. నిజాం దిగిపోతే చాలు అని హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ అంటే.. నిజాం పాలన నుంచి విముక్తి కావాలని కమ్యూనిస్టులు.. ఇలా ఎవరి పంథాలో వారు పోరాటం చేశారు.

నిజాంకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం దించిన సైనికులు చేస్తున్న కవాతు

అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించబోయి..  అప్పటికే దేశానికి స్వేచ్ఛ లభించి ఏడాది కావొస్తుంది. కానీ నిజాం రాజు హైదరాబాద్‌ స్టేట్‌, భారత్‌ మధ్య సమస్య పరిష్కారానికి సహాయం చేయాలని బ్రిటన్‌ ప్రధానిని, అమెరికా అధ్యక్షుడిని, చివరికి ఐక్యరాజ్యసమితి దాకా వెళ్లి సమస్యను పెద్దది చేసే ప్రయత్నం చేశాడు. ఇక చూస్తూ ఊరుకోలేమని నిజాంకు వ్యతిరేకంగా సైనిక చర్యకు దిగాలని 1948 సెప్టెంబరు 9న భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి భారత హోంమంత్రి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ రంగంలోకి దిగారు. సెప్టెంబరు 10న నిజాంను హెచ్చరించడం,  13న ఆపరేషన్‌ పోలోను ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి.  పోలీసు చర్యతో స్టేట్‌ నలువైపుల నుంచి సైన్యాలు హైదరాబాద్‌ను చుట్టుముట్టాయి. భారత సైన్యంతో పోరాడలేమని గుర్తించిన నిజాం ఐదు రోజుల్లోనే సెప్టెంబరు 17న తమ లొంగుబాటును ప్రకటించాడు. దీంతో రెండు శతాబ్దాల అసఫ్‌జాహిల పాలన అంతమైంది. నాడు హైదరాబాద్‌ స్టేట్‌కు ప్రధానిగా ఉన్న లాయక్‌ అలీ తప్పించుకుని పాకిస్థాన్‌ పారిపోయాడు. రజాకార్ల నాయకుడైన కాసీం రజ్వీ జైలు పాలయ్యాడు. ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు.


సైనిక పాలన..


నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ సాయుధ దళం

నిజాం లొంగుబాటు అనంతరం చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌ స్టేట్‌లో పరిపాలన బాధ్యతలను నాటి మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌదరీకి అప్పగించారు. సైనికపాలకుడిగా 1948 సెప్టెంబరు 19న ఆయన బాధ్యతలు చేపట్టారు.1949 డిసెంబరు 1న భారత ప్రభుత్వ రాష్ట్రాల వ్యవహార శాఖలో కార్యదర్శిగా ఉన్న ఎం.కె.వెల్లోడిని భారత సర్కారు ముఖ్యమంత్రిగా నియమించింది. సైనిక పాలన అంతమై తాత్కాలిక ప్రజా ప్రభుత్వం మొదటిసారి ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు, వి.వి.రాజు, విద్యాలంకార్‌లు మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు. 1950 జనవరి 26న హైదరాబాద్‌ స్టేట్‌లో భారత ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ ఉత్సవం నిర్వహించారు. భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందని నిజాం చదివి వినిపించారు. అదే రోజున ఆయన్ను రాజ్‌ప్రముఖ్‌గా భారత సర్కారు నియమించింది.

* 1952లో హైదరాబాద్‌ స్టేట్‌ శాసనసభకు మొదటిసారి ఎన్నికలు జరిగాయి. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1956 వరకు కొనసాగారు.

* రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణతో భాషా ప్రాతిపదికన 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్‌ స్టేట్‌లోని మరాఠా ప్రాంతాలైన 5 జిల్లాలను మహారాష్ట్ర, కన్నడ మాట్లాడే మూడు జిల్లాలను కర్ణాటకలో కలిపారు. తెలంగాణలోని 8 జిల్లాలు, మద్రాస్‌ నుంచి విడిపోయిన ఆంధ్రరాష్ట్రంలోని జిల్లాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేశారు.

* నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయంపై ఆరు దశాబ్దాలపాటు అలుపెరగని  పోరాటంతో 2014 జూన్‌ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts