logo

డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌ అరెస్టు

నగరంలో నిషేధిత మత్తు పదార్థం (ఎండీఎంఏ) విక్రయిస్తున్న నైజీరియన్‌ను నారాయణగూడ పోలీసులతో కలిసి హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌-న్యూ) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు 3 లక్షల విలువ

Published : 13 Aug 2022 02:04 IST

30 గ్రాముల ఎండీఎంఏ, సెల్‌ఫోన్లు, విదేశీ కరెన్సీ స్వాధీనం

స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌, సెల్‌ఫోన్లు, నగదు

నారాయణగూడ, న్యూస్‌టుడే: నగరంలో నిషేధిత మత్తు పదార్థం (ఎండీఎంఏ) విక్రయిస్తున్న నైజీరియన్‌ను నారాయణగూడ పోలీసులతో కలిసి హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌-న్యూ) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు 3 లక్షల విలువ చేసే 30 గ్రాముల మత్తు పదార్థం (ఎండీఎంఏ), నాలుగు సెల్‌ఫోన్‌లు, ఖతార్‌, కెమెన్‌ ఐల్యాండ్స్‌ తదితర దేశాలతో పాటు భారత్‌కు చెందిన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నారాయణగూడ ఠాణాలో శుక్రవారం సాయంత్రం ఇందుకు సంబంధించిన వివరాలను అబిడ్స్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి, నార్కొటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రమేశ్‌రెడ్డి, నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి, డీఐ రవికుమార్‌, హెచ్‌-న్యూ ఎస్సై సి.వెంకటరాములుతో కలిసి మధ్యమండలం డీసీపీ రాజేష్‌చంద్ర వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఓసీగ్వేచుక్వెంక జేమ్స్‌ అలియాస్‌ అలామంజో మిసిచుక్వా (37) భారత్‌లో అక్రమంగా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గోవా నుంచి డ్రగ్స్‌ దిగుమతి చేసుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చి అమ్ముతున్నాడు. జేమ్స్‌ తొలుత 2013లో ఇండియాకు వచ్చి వెళ్లాడు. 2016, 2019లలోనూ వచ్చి తిరిగి వెళ్లిపోయాడు. 2021లో మళ్లీ వచ్చి గోవాలో ఉంటూ డ్రగ్స్‌ అక్రమరవాణా చేస్తూ 2022 మార్చిలో అక్కడి పోలీసులకు చిక్కాడు. అప్పట్లో అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. మూడు నెలల పాటు జైలు ఉండి విడుదలైన జేమ్స్‌ తర్వాత ‘అలామంజో మిసిచుక్వాగా’ మార్చుకొని, నకిలీ ధ్రువపత్రాలతో పాస్‌పోర్టులు సృష్టించి అక్కడే మకాం వేశాడు. నైజీరియాలో ఉండే అతని స్నేహితుడు జాక్‌తో కలిసి డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ మొదలుపెట్టాడు. గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నాడు.

108 మందితో వాట్సాప్‌ గ్రూప్‌: నిందితుడు జేమ్స్‌ 108 మంది వినియోగదారులతో వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అవసరమైనవారికి ఎండీఎంఏ డ్రగ్‌ గ్రాము రూ.7 వేల చొప్పున విక్రయిస్తున్నాడు. ఇది నీళ్లలో కలిపి తాగవచ్ఛు లేదా ముక్కుతో పీలుస్తారని డీసీపీ చెప్పారు. ఈ మత్తు పదార్థం 10 గ్రాములకు మించి ఉంటే అది వ్యాపారమే అవుతుందన్నారు. ఇటీవల మళ్లీ నగరంలో డ్రగ్స్‌ క్రయవిక్రయాలు సాగుతున్నట్లు సమాచారం అందడంతో హెచ్‌-న్యూ బృందం అదనపు డీసీపీ స్నేహ, ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ గట్టి నిఘా పెట్టిందని, కింగ్‌కోఠి నియాజ్‌ఖానా వద్ద డ్రగ్స్‌తో ఓ వ్యక్తి ఉన్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నారాయణగూడ పోలీసుల సహకారంతో మాటువేసి జేమ్స్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. అతడి వాట్సాప్‌ జాబితాలో ఉన్న వినియోగదారుల్లో ఇప్పటికే 63 మంది చిరునామాలను గుర్తించామని, మిగతా వారి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వినియోగదారుల్లో ఇంజినీర్లు, విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని, కొందరి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్నాయని అన్నారు. ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? అనేది విచారించి నిగ్గుతేలుస్తామన్నారు. మత్తు పదార్థాలు అమ్మినవారితో పాటు వినియోగించినవారూ దోషులే అని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని