logo

ఇక అంతేనా...!

జిల్లాలో తాండూరు, వికారాబాద్‌ మున్సిపల్‌ అధ్యక్షురాళ్ల (ఛైర్‌పర్సన్ల) మార్పు ఇప్పట్లో లేనట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాల నేపథ్యంలో తెరాస ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Published : 13 Aug 2022 02:02 IST

ఛైర్‌పర్సన్ల మార్పు ఇప్పట్లో లేనట్లే..

న్యూస్‌టుడే, తాండూరు: జిల్లాలో తాండూరు, వికారాబాద్‌ మున్సిపల్‌ అధ్యక్షురాళ్ల (ఛైర్‌పర్సన్ల) మార్పు ఇప్పట్లో లేనట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాల నేపథ్యంలో తెరాస ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాండూరు, వికారాబాద్‌ మున్సిపాలిటీలో రెండున్నరేళ్ల పదవీ కాలం పూర్తయిన తెరాస ఛైర్‌పర్సన్లు స్వప్న, మంజులను పదవి నుంచి దిగిపోవాల్సిందిగా సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు, నాయకుల నుంచి డిమాండ్‌ వస్తోంది. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.

వజ్రోత్సవాల నిర్వహణకు సంబంధించి వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ సమావేశంలో తెరాస కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్‌ మంజులను పదవిని వదిలి పోవాలని రసాభాస చేశారు. ఈ తరుణంలో రాష్ట్రంలో అనూహ్యంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఇక్కడ ఉప ఎన్నిక జరగడం లాంఛనంగా మారింది. ఎన్నికలకు ముందు తాండూరు, వికారాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లను తప్పిస్తే తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఫలితం ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో మునుగోడు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఛైర్‌పర్సన్ల మార్పుపై అధిష్ఠానం పెద్దగా స్పందించడం లేదని తెలియడంతో తాండూరు, వికారాబాద్‌ తెరాసలో విమర్శలు, ప్రతి విమర్శలకు తాత్కాలిక బ్రేకు పడినట్లయింది.

చర్చకు రాలేదని...: వికారాబాద్‌లో ఈనెల 16న సమీకృత కలెక్టర్‌ కార్యాలయం, జిల్లా తెరాస కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కేసీఆర్‌ గురువారం జిల్లా ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ సందర్భంగా తాండూరు, వికారాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ల మార్చే అంశం చర్చకు రాలేదని సమాచారం. దీంతో మార్పు అంశం వాయిదా పడినట్లేనని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని