logo

భవనం ఇక్కడ.. బోధన అక్కడ..!

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల పాఠశాలకు అన్నిహంగులతో భవనం నిర్మించారు. ఆరు నెలలు గడిచినా అందుబాట్లోకి తేవడం విస్మరించారు. మరోవైపు గురుకులాన్ని పొరుగు జిల్లాలో కొనసాగిస్తున్నారు. అసౌకర్యాలతో ఉన్న అద్దె భవనంలో

Updated : 13 Aug 2022 02:13 IST

రూ.4.97 కోట్లతో నిర్మాణం

 వృథాగా గిరిజన బాలికల గురుకుల పాఠశాల 

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ

నిరుపయోగంగా భవనం

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల పాఠశాలకు అన్నిహంగులతో భవనం నిర్మించారు. ఆరు నెలలు గడిచినా అందుబాట్లోకి తేవడం విస్మరించారు. మరోవైపు గురుకులాన్ని పొరుగు జిల్లాలో కొనసాగిస్తున్నారు. అసౌకర్యాలతో ఉన్న అద్దె భవనంలో వందలాది మంది విద్యార్థినులకు అవస్థలు తప్పడం లేదు. స్థానికంగా భవనాన్ని వినియోగంలోకి తెస్తే విద్యార్థులు, తల్లిదండ్రులకు సౌకర్యంగా మారుతుందని పలువురు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

నాలుగు అంతస్థుల్లో...

తాండూరు నియోజకవర్గానికి సంబంధించి గిరిజన గురుకుల పాఠశాల భవనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.4.20కోట్లు మంజూరు చేశాయి. వీటితో 2018లో పనులు మొదలయ్యాయి. నాలుగు అంతస్థుల్లో వందల మంది విద్యార్థినుల వసతికి, బోధనకు, భోజనానికి అనువుగా విశాలమైన భవనాన్ని నిర్మించారు. రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ విద్యా సంవత్సరం జూన్‌లో కొత్త భవనంలో పాఠాలు ప్రారంభిస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు భావించారు. విద్యా సంవత్సరం ఆరంభమై రెండు నెలలు గడిచినా ఊసెత్తకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

వంద కిలో మీటర్లు వెళ్లాలి

మరోవైపు గురుకుల పాఠశాలను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో మూతపడిన ఓ ఇంజనీరింగ్‌ కళాశాల భవనాన్ని అద్దెకు తీసుకొని అందులో నిర్వహిస్తున్నారు. భవనంలో ఆరు నుంచి పదో తరగతి, ఇంటర్‌ తరగతుల్లోని 600మందికిపైగా విద్యార్థినుల బోధన, వసతికి అనువైన సదుపాయాలు లేకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెలవు దినాల్లో పిల్లల్ని కలిసేందుకు, పండగపూట ఇళ్లకు తీసుకొచ్చేందుకు తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాలతోపాటు పట్టణంలోని తల్లిదండ్రులు పొరుగు జిల్లాలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలకు వెళ్లాలంటే వంద కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని వాపోయారు. రానుపోను 200కిలోమీటర్ల ప్రయాణం, దాదాపు రూ.500ల రవాణా ఖర్చులు భరించాల్సి రావడంతోపాటుతో ఒకరోజు సమయం పడుతోంది.

పరిగి, కొడంగల నియోజకవర్గాల్లో సొంత భవనాలను అందుబాటులోకి తెచ్చారు. తాండూరు నియోజకవర్గానికి సంబంధించి తాండూరు-చించోళి అంతర్‌ రాష్ట్ర రహదారికి సమీపంలో జిన్‌గుర్తి వద్ద రెండు ఎకరాల్లో నిర్మించిన భవనంలో గురుకుల పాఠశాలను కొనసాగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఎమ్మెల్యే, పాలనాధికారిణి చొరవతో..

గురుకుల పాఠశాల భవన నిర్మాణం పూర్తయ్యాక ప్రహరీ నిర్మింపజేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రతినిధులు, పాఠశాల అధ్యాపక బృందం తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కోరారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే రూ.77లక్షల డీఎమ్‌ఎఫ్‌టీ నిధులు కేటాయించారు. ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మే 15న శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పనులు తుది దశకు చేరాయి. విద్యుత్‌ కనెక్షన్‌ నిమిత్తం నియంత్రిక ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడంతో జిల్లా పాలనాధికారిణి నిఖిల వెంటనే ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించడంతో విద్యుత్‌ శాఖ అధికారులు నియంత్రికను అమర్చడంతో విద్యుత్‌ సరఫరా నాలుగురోజుల క్రితం ప్రారంభమైంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిదుల చొరవతో అన్నిసదుపాయాల్ని సమకూర్చినందున పక్క జిల్లాలోని అద్దె భవనంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలను నూతన భవనంలోకి తరలించాలని విద్యార్థినిలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

రూ.77లక్షల డీఎమ్‌ఎఫ్‌టీ నిధులతో ఎమ్మెల్యే ఆవిష్కరించిన శిలాఫలకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని