logo

పుస్తక నేస్తాలు.. ప్రతిభా భూషణాలు

గణితమో... భౌతికశాస్త్రమో.. జీవశాస్త్రమో.. రసాయనశాస్త్రమో.. ఇలా ఏ ఒక్క సబ్జెక్టుకో ఎక్కువ సమయం కేటాయించి చదవడం కాదు.. ప్రతి సబ్జెక్టుపై దృష్టి ఉండాలి.. నిత్యం నిర్దేశిత సమయం పెట్టుకుని చదువుకోవాలి.. అప్పుడే మంచి ర్యాంకులు

Published : 13 Aug 2022 02:02 IST

ఎంసెట్‌ టాప్‌-10లో ఐదుగురు నగర విద్యార్థులే!

ఈనాడు, హైదరాబాద్‌: గణితమో... భౌతికశాస్త్రమో.. జీవశాస్త్రమో.. రసాయనశాస్త్రమో.. ఇలా ఏ ఒక్క సబ్జెక్టుకో ఎక్కువ సమయం కేటాయించి చదవడం కాదు.. ప్రతి సబ్జెక్టుపై దృష్టి ఉండాలి.. నిత్యం నిర్దేశిత సమయం పెట్టుకుని చదువుకోవాలి.. అప్పుడే మంచి ర్యాంకులు సాధించేందుకు వీలుంటుందని చెబుతున్నారు ఎంసెట్‌ టాప్‌ ర్యాంకర్లు. తెలంగాణ ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌, మెడిసిన్‌-అగ్రికల్చర్‌ విభాగంలో టాప్‌-10లో నగరానికి చెందిన ఐదుగురు విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. ఎంసెట్‌లో టాపర్లుగా నిలిచిన పలువురు ‘ఈనాడు’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు..

అన్ని సబ్జెక్టులకు సమప్రాధాన్యం

కొత్తపల్లి మహీత్‌అంజన్‌, మెడిసిన్‌ విభాగం 4వ ర్యాంకు, సర్దార్‌పటేల్‌ నగర్‌

తల్లిదండ్రులు, సోదరుడితో మహీత్‌

కళాశాలలో నిత్యం 12-13గంటలపాటు స్టడీ ప్లాన్‌ ఉండేది. దానికి తగ్గట్టుగా సన్నద్ధమయ్యా. రోజు ఉదయం ఒక ప్రణాళిక వేసుకుని సబ్టెక్టుల వారీగా సమయం కేటాయించి చదువుకునేవాడ్ని. నాకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఎక్కువ ఇష్టం. మనకు ఇష్టమైన సబ్జెక్టులకే కాదు.. అన్నింటికీ సమ ప్రాధాన్యం, సమయం కేటాయించి చదివితే సులువుగా ర్యాంకు సాధించవచ్ఛు నాన్న శ్రీనివాస్‌, ఆర్కిటెక్ట్‌. అమ్మ మాధవి. ఏపీ ఎంసెట్‌లో 54వ ర్యాంకు వచ్చింది. నీట్‌ ర్యాంకు ఆధారంగా ఎక్కడ చేరాలనేది నిర్ణయం తీసుకుంటా.

నీట్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా

గోపిశెట్టి వీఎస్‌వీ శ్రీశశాంక్‌, మెడిసిన్‌ విభాగం 8వ ర్యాంకు, మదీనాగూడ

ఎంసెట్‌లో 8వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లోనూ 7వ ర్యాంకు వచ్చింది. నాన్న శ్రీనివాస్‌ ఐటీ కన్సల్టెంట్‌. అమ్మ కల్పన. నిత్యం 5 గంటలపాటు సబ్జెక్టుల వారీగా సమయాన్ని విభజించుకుని చదివేవాడిని. బయోలజీ, కెమిస్ట్రీపై ఎక్కువగా దృష్టి సారించా. ప్రస్తుతం నీట్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా.

రసాయనశాస్త్రంపై దృష్టి పెట్టాలి

గంజి ప్రణీత్‌, మెడిసిన్‌ విభాగం 9వ ర్యాంకు, ఉప్పర్‌పల్లి

కళాశాలలో సమయం కాకుండా అదనంగా 4 గంటలు సమయం కేటాయించి చదివేవాడిని. ఫిజిక్స్‌, బయోలజీ అంటే ఎక్కువ ఇష్టం. సాధారణంగా విద్యార్థులకు రసాయనశాస్త్రం క్లిష్టతరంగా ఉంటుంది. దానిపై పట్టు సాధించేందుకు కొంచెం ఎక్కువ సమయం కేటాయిస్తే మంచిది. నీట్‌ ర్యాంకు ఆధారంగా ఎయిమ్స్‌ లేదా జిప్‌మర్‌లో చేరాలనుకుంటున్నా. నాన్న సత్యంకుమార్‌ బిజినెస్‌ చేస్తుంటారు. అమ్మ సుజాత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

నిత్యం 12 గంటలు సాధన చేశా

ఇమ్మిడిశెట్టి నందన్‌ మంజునాథ్‌, ఇంజినీరింగ్‌ 10వ ర్యాంకు, కూకట్‌పల్లి

నిత్యం 12 గంటలపాటు సాధన చేశా. ప్రతి సబ్జెక్టుకు సమయాన్ని కేటాయించుకుని చదువుతున్నా. జేఈఈ మెయిన్‌లో 99.98 పర్సంటైల్‌ సాధించా. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నా. ఇందులో ర్యాంకు సాధించి ఐఐటీ బొంబేలో చదవాలనుకుంటున్నా. ఏపీ ఎంసెట్‌లోనూ 9వ ర్యాంకు వచ్చింది. అమ్మ రమ. నాన్న మల్లికార్జునరావు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని