Congress: మూడు దశాబ్దాలు కాంగ్రెస్‌కు హోంగార్డును.. ట్విటర్‌ ప్రొఫైల్‌ను మార్చేసిన ఎంపీ కోమటిరెడ్డి

గత కొద్ది రోజులుగా పీసీసీ తీరుపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ట్విటర్‌ ప్రొఫైల్‌లో తాను

Published : 14 Aug 2022 02:47 IST

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా పీసీసీ తీరుపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ట్విటర్‌ ప్రొఫైల్‌లో తాను కాంగ్రెస్‌ హోంగార్డు అంటూ పేర్కొనడం గమనార్హం. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ప్రస్తుతం ఎంపీని.. అని పేర్కొంటూ మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌ పార్టీకి హోంగార్డుగా పనిచేస్తున్నానని తన ట్విటర్‌ ఖాతాలో ఆయన మార్పులు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే.. తని నిర్ణయాన్ని మార్చుకుని 3దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌కు హోంగార్డును అనే పదాన్ని తొలగించారు.

చండూరులో నిర్వహించిన సభలో అద్దంకి దయాకర్‌ అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై దయాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తనను తిట్టినందుకు ఆ సభకు అధ్యక్షత వహించిన రేవంత్‌ కూడా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో రేవంత్‌ క్షమాపణ చెబుతూ ఇవాళ ఓ వీడియోను విడుదల చేశారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్లు అద్దంకి దయాకర్‌ చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఔన్నత్యంతో తన తరఫున క్షమాపణలు చెప్పారన్నారు. సోదర భావంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు రాత పూర్వకంగా క్షమాపణ చెబుతూ వివరణ ఇచ్చినట్లు అద్దంకి దయాకర్‌ తెలిపారు. ఆ తర్వాత బహిరంగంగా క్షమాపణలు చెప్పానని.. ఇప్పుడు మరోసారి క్షమాపణలు చెప్తున్నట్లు పేర్కొన్నారు. 

అలా అయితే నేనూ రాజీనామా చేస్తా...

రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందంటే తాను కూడా రాజీనామా చేస్తానని భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.  భువనగిరిలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. అద్దంకి దయాకర్‌పై ఫిర్యాదును అధిష్ఠానం చూసుకుంటుందన్న వెంకట్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పడం శుభపరిణామమన్నారు. ‘‘మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్‌. నన్ను సంప్రదించకుండా కాంగ్రెస్‌ పెద్దలు కమిటీ వేశారు, వాళ్లే చూసుకుంటారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఫామ్‌హౌస్‌, ప్రగతి భవన్‌ నుంచి బయటకు వస్తారు. ఆ నియోజకవర్గ అభివృద్ధికి వరాలు కురిపిస్తారు. రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ రైలు కోసం రూ.90కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే .. రూ.500కోట్లతో పనులు మొదలుపెడతామని కేంద్రం చెప్పింది. ఇంత వరకు రూ.90 కోట్లు వాటా కట్టలేదు. దళితబంధు నియోజకవర్గంలోని ఒక గ్రామానికే ఇస్తామన్నారు. పైలట్‌ ప్రాజెక్టు అన్నారు. రాష్ట్రం మొత్తం ఇవ్వాలి. బీసీలకు, ఎస్టీలకు ఇలాంటి స్కీమ్‌ పెట్టాలి. ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం వరాలు ఇస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాగానే 10లక్షల మందికి పింఛన్లు ఇస్తామంటున్నారు. తొమ్మిదేళ్లలో ఒక్క ఇల్లు అయినా కట్టారా? కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు నియోజకవర్గాల్లో మాత్రం 57వేల ఇళ్లు కట్టారు. మునుగోడులో పోడు భూముల సమస్య ఉంది. పరిష్కరించాలని చెప్పినా, ఇంతవరకు పట్టించుకోలేదు’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని