logo
Published : 14 Aug 2022 03:03 IST

కారు కొని దర్జాగా తిరగాలని..యజమాని ఇంట్లో చోరీ

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: చేతిలో డబ్బులుంటే కారు కొని దర్జాగా తిరగొచ్చని.. జీవితంలో స్థిరపడొచ్చని ఆ బాలుడు భావించాడు. అనుకున్నదే తడవుగా తన మిత్రులతో ప్రణాళిక రచించి.. ఆశ్రయం ఇచ్చిన యజమాని ఇంటికే కన్నం వేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో అతనితో పాటు అతడిని సహకరించిన ఇద్దరిని అరెస్టు చేశారు. మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో డీసీపీ రక్షితాకృష్ణమూర్తి శనివారం ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన బాలుడు(16) స్వస్థలంలో 9వ తరగతి వరకు చదివి..నెలన్నర క్రితం హయత్‌నగర్‌లో ఉండే బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడ వారి సహకారంతో మేడిపల్లి ఠాణా పరిధి బోడుప్పల్‌ హేమానగర్‌ డోవెల్‌ కాలనీలో ఉంటూ హార్డ్‌వేర్‌ దుకాణం నడిపించే మోహన్‌లాల్‌ చౌదరి వద్ద పనికి కుదిరాడు. యజమాని తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు. అయితే సరిగా పని చేయకపోవడంతో కొన్ని రోజుల క్రితం పని నుంచి తొలగించాడు. దీంతో బాలుడు రాజస్థాన్‌ వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లాక యజమాని ఇంట్లో డబ్బులు, నగలు కొట్టేసి.. జీవితంలో స్థిరపడాలని, కారు కొని దర్జాగా తిరగాలనే ఆలోచన వచ్చింది. స్వగ్రామంలో ఉండే మిత్రులు బల్వంత్‌చౌదరి (21), రాంనివాస్‌(21), సునిల్‌ చౌదరి(21)లకు తన ప్రణాళిక చెప్పాడు. దోచుకున్న సొత్తులో వాటా ఇస్తానని ఆశ చూపాడు. ఈ క్రమంలో నలుగురు కారులో బయలుదేరి ఈ నెల 6న హైదరాబాద్‌ వచ్చారు. ఇల్లు, దుకాణం, వద్ద రెక్కీ నిర్వహించారు. ఈ నెల 8న మోహన్‌లాల్‌ భార్య ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. అదే అదనుగా భావించి వంట గదిలోని ఇనుప గ్రిల్‌ తొలగించి లోపలికి చొరబడ్డారు. బీరువా పగలగొట్టి 20 తులాల బంగారు ఆభరణాలు, రెండున్నర కేజీల వెండి, రూ.7.5 లక్షల నగదు, ఇతర ఆభరణాలు తీసుకొని పారిపోయారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన యజమాని భార్య సుశీల..చోరీ జరిగినట్లు గుర్తించి.. మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌బాబు బృందం సీసీ కెమెరాల్లో నిందితులను గుర్తించారు. శనివారం ఘట్కేసర్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద బాలుడితో పాటు బల్వంత్‌చౌదరి, రాంనివాస్‌లను అరెస్టు చేశారు. నిందితుడు సునిల్‌ చౌదరి పరారీలో ఉన్నాడు. వారి నుంచి రూ.23 లక్షల విలువైన ఆభరణాలు, కారు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని