logo
Updated : 14 Aug 2022 06:42 IST

విహారయాత్రకు వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతి

పెద్దఅడిశర్లపల్లి, మొయినాబాద్‌, న్యూస్‌టుడే: విహారయాత్రకు వచ్చి ముగ్గురు యువకులు నీటమునిగి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా పీఏపల్లి మండలంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు అక్కంపల్లి జలాశయంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పుట్టంగండికి చెందిన ప్రియాంక రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని చిల్కూరు బాలాజీ కళాశాలలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె క్లాస్‌మేట్స్‌ అయిన నిజామాబాద్‌ జిల్లా బిచ్కుందకు చెందిన దిండె ఆకాశ్‌(20), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన బంటు గణేశ్‌(20), హైదరాబాద్‌కు చెందిన విజయ్‌రెడ్డి, వరంగల్‌కు చెందిన లోహిత్‌, జడ్చర్లకు చెందిన చందు, ఖమ్మంకు చెందిన అవినాష్‌, నాంపల్లిలోని చైతన్య కళాశాలలో ఇంటర్‌ చదివే సోదరుడు కృష్ణ (18) హైదరాబాద్‌లో రూమ్‌లో కలిసి ఉంటున్నారు. సెలవులు రావడంతో నాగార్జునసాగర్‌ డ్యాం సందర్శించడానికి నిర్ణయించుకున్నారు. శనివారం అందరూ కలిసి పుట్టంగండి వచ్చారు. కృష్ణ తండ్రి గజానన్‌తో కలిపి మొత్తం 9 మంది సాగర్‌కు వెళ్లారు. కృష్ణమ్మ అందాలు వీక్షించి సరదాగా గడిపారు. తిరుగు ప్రయాణంలో అక్కంపల్లి జలాశయం హెడ్‌రెగ్యులేటర్‌ సమీపంలో ప్రియాంక, ఆమె తండ్రి మినహా అందరూ జలాశయంలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో అలల తాకిడికి ముగ్గురు గల్లంతయ్యారు. గణేశ్‌, కృష్ణను బయటకు తీసేలోపే మృతిచెందారు. ఆకాశ్‌ ఆచూకీ లేకపోవడంతో పోలీసులు స్థానిక జాలరులతో  గాలింపు చేపట్టగా విగతజీవిగా లభ్యమయ్యాడు. ఘటనా స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ ఎం.నాగేశ్వర్‌రావు, కొండమల్లేపల్లి, సీఐ వై.రవీందర్‌ పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై పి.వీరబాబు తెలిపారు. కొద్ది రోజుల్లో పరీక్షలు ఉండటంతో ఇంట్లో ఉండి సన్నద్ధమవ్వాలని మూడు రోజుల క్రితమే ఇళ్లకు పంపించినట్లు ఫార్మా కళాశాలకు చెందిన ప్రతినిధులు వెల్లడించారు. కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల మృతితో కళాశాలలో విషాదం నెలకొంది. మృతుల స్నేహితులు పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని