logo

నా జీవితంలో క్యాన్సర్‌ ఒక పేజీ మాత్రమే

జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, క్యాన్సర్‌ కూడా తన జీవితంలో ఒక పేజీ మాత్రమేనని ప్రముఖ నృత్య కళాకారిణి డాక్టర్‌ ఆనంద శంకర్‌ జయంత్‌ అన్నారు. చికిత్స తీసుకునే సమయంలోనూ తనకిష్టమైన నృత్యం ఆపలేదన్నారు. తన ప్రదర్శనలకు అనుగుణంగా

Published : 14 Aug 2022 06:41 IST

ప్రముఖ నృత్య కళాకారిణి ఆనంద శంకర్‌ జయంత్‌

ఈనాడు, హైదరాబాద్‌: జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, క్యాన్సర్‌ కూడా తన జీవితంలో ఒక పేజీ మాత్రమేనని ప్రముఖ నృత్య కళాకారిణి డాక్టర్‌ ఆనంద శంకర్‌ జయంత్‌ అన్నారు. చికిత్స తీసుకునే సమయంలోనూ తనకిష్టమైన నృత్యం ఆపలేదన్నారు. తన ప్రదర్శనలకు అనుగుణంగా కీమో..రేడియేషన్‌ థెరఫీలను సర్దుబాటు చేయడంలో వైద్యులు ఎంతో సహకరించారన్నారు. హైదరాబాద్‌ హోటల్‌ మ్యారియట్‌లో జరుగుతున్న జాతీయ రొమ్ము క్యాన్సర్‌ శస్త్ర చికిత్స నిపుణుల సంఘం(అబ్సికాన్‌) వార్షిక సదస్సులో భాగంగా రెండో రోజు శనివారం డాక్టర్‌ ఆనంద శంకర్‌ జయంత్‌ పాల్గొని మాట్లాడారు. ‘2008లో తనకు రొమ్ము క్యాన్సర్‌ అని వైద్యులు చెప్పినప్పుడు ఆ విషయం వినేందుకు సంసిద్ధంగా లేను. క్యాన్సర్‌, స్టేజీ, గ్రేడ్‌ అనే పదాలే నాకు వినిపించాయి. అవి ఒక వ్యాధికి సంబంధించినవి కాకుండా...వేరేలా అన్వయించుకున్నా. బ్రెస్ట్‌ కేన్సర్‌ సర్జన్‌ డాక్టర్‌ రఘురాం, వారి బృందం ఎంతో సహకరించింది’ అని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ పౌండేషన్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ గైనకాలజిస్టు, రొమ్ము కేన్సర్‌ విజేత డాక్టర్‌ ఉషాలక్మి గౌరవార్థం అబ్సికాన్‌ అధ్యక్షులు డాక్టర్‌ దీపేంద్ర సర్కార్‌ ప్రసంగం చేశారు. డాక్టర్‌ ఉషాలక్ష్మి 69 ఏళ్ల వయసులో వ్యాధి బారిన పడినా మనోధైర్యంతో దాన్ని జయించారన్నారు. ప్రస్తుతం 89 ఏళ్ల వయసులో ఎంతోమంది రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు తన మాటలతో మనోధైర్యం కల్పించడం గొప్ప విషయమన్నారు. తనలాంటి బాధ ఇంకెవరూ పడకూడదని తన కుమారుడు, ప్రముఖ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ రఘురాంను ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పౌండేషన్‌ స్థాపించేలా ప్రోత్సహించారన్నారు. ఇంగ్లండ్‌లో ఎంతో భవిష్యత్తు ఉన్నప్పటికీ తన తల్లి మాటతో ఇండియాకు తిరిగి వచ్చి ఇక్కడ విలువైన సేవలు అందించడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఆనంద శంకర్‌ జయంత్‌ను డాక్టర్‌ ఉషాలక్ష్మి సాలువతో సత్కరించి జ్ఞాపిక బహూకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని