logo

మువ్వన్నెల సంబరం.. ముస్తాబైంది నగరం

దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయ భావం తొణికిసలాడింది. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి నగరం మూడు రంగులతో ముస్తాబైంది. ఎప్పుడూ లేనట్టు.. ప్రతి చోటా మువ్వన్నెల జెండా రెపరెపలు చూపరులకు కొత్త

Published : 15 Aug 2022 03:17 IST

ఈనాడు, హైదరాబాద్‌

దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయ భావం తొణికిసలాడింది. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి నగరం మూడు రంగులతో ముస్తాబైంది. ఎప్పుడూ లేనట్టు.. ప్రతి చోటా మువ్వన్నెల జెండా రెపరెపలు చూపరులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా నగరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలు, ప్రతి ఇంటిపై రెపరెపలాడుతున్న జాతీయ జెండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, చిన్నస్థాయి కిరాణా దుకాణాల నుంచి భారీ రిటైల్‌ స్టోర్ల వరకు అంతటా మువ్వన్నెల జెండాలతో నిండిపోయాయి. చారిత్రక ప్రదేశాలు, ఆకాశ హర్మ్యాలు విద్యుద్దీప కాంతులతో వెలుగులీనుతుండటంతో నగరం కొత్త రూపు సంతరించుకుంది. అసెంబ్లీ, చార్మినార్‌, బీఆర్‌కే భవన్‌, గోల్కొండ, గన్‌పార్కు తదితర ప్రదేశాల్లో విద్యుద్దీప కాంతులు అందరినీ ఆకట్టుకున్నాయి. త్రివర్ణ రంగులతో మెరిసిపోతున్న చార్మినార్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. ఫొటోలు తీసుకుంటూ మురిసిపోయారు. బేగంబజార్‌లో వజ్రోత్సవ వేడుకలను వినూత్నంగా నృత్యాలతో జరిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలతో సైకిల్‌ ర్యాలీ చేపట్టారు. పలుచోట్ల సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి హరితహారం నిర్వహించాయి. ఇందులో భాగంగా మెక్కలతో పాటుగా జాతీయ జెండాలు ఉంచారు. పలు కాలనీల్లో చిన్నారులు జెండా పట్టుకుని వీధివీధి తిరుగుతూ నినాదాలు చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పటాన్‌చెరు ఆర్‌సీపురం సర్కిల్‌లో జానపద కళాకారుల ప్రదర్శనలు నిర్వహించారు. అల్వాల్‌ సర్కిల్‌లో ప్రజా గాయకుడు గద్దర్‌ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత కలిసి జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మూసాపేట్‌లోని బాలాజీనగర్‌ ఐడీఎల్‌ ట్యాంక్‌ వద్ద బాణసంచాలు కాల్చి సంబరాలు నిర్వహించారు. పలు జోన్లలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

హుస్సేన్‌సాగర్‌లో జెండా రెపరెపలు
హుస్సేన్‌సాగర్‌లోని ప్రతి బోటుకు జాతీయ పతకాలు కట్టి పరేడ్‌ నిర్వహించారు. బుద్ధ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విద్యుద్దీపకాంతులు, ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన జాతీయ జెండాలతో జాతీయ భావం ఉప్పొగింది. దుర్గంచెరువు వద్ద జాతీయ పతాకాలతో 10 పడవల పరేడ్‌ ఆకట్టుకుంది.

గోల్కొండ కోటలో ఏర్పాట్లు.. పంద్రాగస్టు వేడుకలకు కోట వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్‌ ఇక్కడ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. సోమవారం ఉదయం 7నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రామ్‌దేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట రోడ్డుపై సాధారణ వాహనాల రాకపోకలు నియంత్రిస్తారు. ఏ, బీ, సీ పాసు హోల్టర్ల వాహనాలు మాత్రమే అనుమతించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు