logo

వర్ధిల్లాలిక.. విశ్వ నగరంగ!

75 ఏళ్ల స్వాతంత్య్రం.. వజ్రోత్సవ శోభను అందిపుచ్చుకుని శతాబ్ది దిశగా మొదలైన పయనంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ముందుకు సాగాల్సిన తరుణమిది. ఈ సమయంలో పరిష్కార మార్గాలు అన్వేషించుకుని సరికొత్త ప్రయాణం ప్రారంభించాలి.

Updated : 15 Aug 2022 04:16 IST

సవాళ్లు దాటుకుని సాగితే సదా ‘భాగ్య’మే

ఈనాడు, హైదరాబాద్‌

75 ఏళ్ల స్వాతంత్య్రం.. వజ్రోత్సవ శోభను అందిపుచ్చుకుని శతాబ్ది దిశగా మొదలైన పయనంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ముందుకు సాగాల్సిన తరుణమిది. ఈ సమయంలో పరిష్కార మార్గాలు అన్వేషించుకుని సరికొత్త ప్రయాణం ప్రారంభించాలి. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న భాగ్యనగరి ముందు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సవాళ్లను దాటుకుని విశ్వనగరంగా ప్రస్థానానికి సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రాఫిక్‌.. పెట్టేద్దాం చెక్‌
నగరంలో దాదాపు 75 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో 75శాతం మేర ద్విచక్ర వాహనాలే. 19 శాతం కార్లు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా రహదారుల విస్తరణకు తోడు ప్రజా రవాణాకు పెద్దపీట వేయాలి. బస్సుల సంఖ్య పెంచడం, ఎంఎంటీఎస్‌, మెట్రో విస్తరణ పనులు పూర్తి చేయడంతోపాటు బీఆర్‌టీఎస్‌, పీఆర్‌టీఎస్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. ఇప్పటికే దాదాపు 22 పైవంతెనలు పూర్తి చేయగా.. 16 నిర్మాణంలో ఉన్నాయి. మరో 70 నిర్మించాల్సిన అవసరముంది.

కాలుష్యం.. చొరవ చూపితేనే పరిష్కారం
హైదరాబాద్‌ కాలుష్యం దేశంలోని మిగిలిన నగరాలతో పోటీ పడుతోంది. వాహనాల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణం. భవిష్యత్తులో నగరంలో ఆరెంజ్‌, రెడ్‌ కేటగిరీలో ఉన్న పరిశ్రమలను దూర ప్రాంతాలకు తరలించాలి. మొక్కల పెంపకం మరింతగా చేపట్టాలి. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సాహకాలు ఇచ్చి సంఖ్య పెరిగేందుకు కృషి చేయాలి. సైక్లింగ్‌ ట్రాక్‌లకు చోటు ఉండాలి.

అంకురం.. ఉపాధికి అవకాశం
సమీప భవిష్యత్తు పూర్తిగా అంకుర సంస్థలపైనే ఆధాపడి ఉంది. వృద్ధిరేటు పెంచుకోవాలన్నా, ఉపాధి కల్పనను పరుగులు పెట్టించాలన్నా అంకుర సంస్థలకు అమృతకాలం తీసుకురావాలి. నగరంలో టీహబ్‌, టీహబ్‌ ఫేజ్‌-2 సాయంతో దాదాపు 1500 అంకుర సంస్థలకు చేయూత దక్కుతోంది. మరిన్ని ఇంక్యుబేషన్‌ కేంద్రాలు అందుబాటులోకి రావాలి. మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలి.

చదువునిస్తే.. వెలుగునిస్తుంది
విద్యారంగానికి నగరం గమ్యస్థానంగా మారినా అందుకు తగిన వసతుల్లేక కునారిల్లుతోంది. ఉన్నత విద్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఓయూ, జేఎన్‌టీయూ, తెలుగు, అంబేడ్కర్‌ సహా అన్ని చోట్ల బోధన, బోధనేతర సిబ్బంది 70శాతం మేర ఖాళీలున్నాయి. వీటి భర్తీ చేపడితే మరో పాతికేళ్లు బోధనకు ఆటంకం ఉండదు. ప్రభుత్వ విద్యావ్యవస్థను పరిపుష్టం చేయాలి. ప్రైవేటు విభాగంలోనూ ఫీజుల నియంత్రణకు పకడ్బందీ చట్టాలు రావాలి.


వైద్యం.. సిద్ధమేనా మనం

చౌకగా.. నాణ్యమైన, ఆధునిక వైద్యానికి హైదరాబాద్‌ చిరునామా. ప్రైవేటు రంగం విస్తరిస్తుండటంతో ప్రభుత్వ వైద్యం పేదలకు దూరమవుతోంది. నగరంలో 4వేల ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ విభాగంలో ఆసుపత్రులను బలోపేతం చేయడంతో పాటు కొత్త దవాఖానాలు ఏర్పాటుచేయాలి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts