logo

ఎందరో సమరయోధులు.. అందరికీ వందనాలు

బ్రిటిష్‌ సామ్రాజ్యవాద విస్తరణకు వ్యతిరేకంగా కొందరు.. నిజాం పాలనను అంతమొందించాలని మరికొందరు.. ఉన్నత పదవులు వదిలిపెట్టి, చేస్తున్న వృత్తులకు విరామమిచ్చి స్వతంత్రం కోసం హైదరాబాద్‌కు చెందిన పలువురు పిడికిలి బిగించారు. బ్రిటీషర్లను

Updated : 15 Aug 2022 04:24 IST

బానిస సంకెళ్ల విముక్తికి వీరోచిత పోరాటం

ఈనాడు, హైదరాబాద్‌

బ్రిటిష్‌ సామ్రాజ్యవాద విస్తరణకు వ్యతిరేకంగా కొందరు.. నిజాం పాలనను అంతమొందించాలని మరికొందరు.. ఉన్నత పదవులు వదిలిపెట్టి, చేస్తున్న వృత్తులకు విరామమిచ్చి స్వతంత్రం కోసం హైదరాబాద్‌కు చెందిన పలువురు పిడికిలి బిగించారు. బ్రిటీషర్లను భారత గడ్డ నుంచి తరిమేవరకు... రజాకార్ల దాష్టీకాలను అంతం చేసేవరకు ప్రత్యక్షంగా, కాందిశీకులుగా అలుపెరగని పోరాటం చేశారు. ఎవరి స్థాయిలో వారు భరతమాత బానిస సంకెళ్ల నుంచి స్వేచ్ఛ కోసం పెద్ద ఉద్యమమే చేశారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ ఎందరో సమరయోధులు.. అందరికీ వందనాలు.

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా...
బ్రిటిష్‌ సామ్రాజ్యవాద విషకౌగిలి నుంచి హైదరాబాద్‌ స్టేట్‌ను విముక్తం చేయడానికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తుల్లో హైదరాబాద్‌కు చెందిన రాజా మహీపతిరాం ఒకరు. నిజాం హయాంలోని బిరార్‌కు 1800 నుంచి 1806 వరకు గవర్నర్‌గా ఉండేవారు. బ్రిటీష్‌ రెసిడెంట్‌ ఒత్తిడితో మహీపతిరావును గవర్నర్‌ పదవి నుంచి తొలగించారు. అయినా లెక్కచేయకుండా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.

ఉద్యోగానికి  రాజీనామా చేసి..
హైదరాబాద్‌కు చెందిన బాఖర్‌ అలీ నిజాం ప్రభుత్వంలో అటవీ శాఖ అధికారి. జాతీయ ముస్లింవాది కావడంతో బ్రసెల్స్‌లో జరిగిన యాంటీ ఇంపీరియలిస్టు సదస్సుకు భారతీయ ప్రతినిధిగా వెళ్లారు. బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా అక్కడ గళం విప్పారు. బ్రిటిష్‌ వ్యతిరేక విధానాలను వదిలిపెట్టాలని నిజాం ప్రభుత్వం ఆదేశించడంతో... నిరసనగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించారు. రజాకార్ల దురాగతాల నుంచి హైదరాబాద్‌ సంస్థానాన్ని కాపాడండి.. వారిని చెల్లాచెదురు చేయండని.. 1948 ఆగస్టు 13న జాతీయ ముస్లింలు నిజాంకు జారీ చేసిన తాఖీదుపై సంతకం చేసిన  వారిలో బాఖర్‌ ఒకరు.


కలం ఎక్కుపెట్టి..
చేవెళ్లలో పుట్టినా హైదరాబాద్‌లో స్థిరపడిన మందముల నరసింగరావు న్యాయ శాస్త్ర పట్టభద్రులు. కాంగ్రెస్‌ నాయకుడు, పత్రిక రచయిత కూడా. 1921లో ఆంధ్ర జనసంఘాన్ని స్థాపించిన ప్రముఖుల్లో ఒకరు.. న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి 1927లో రయ్యత్‌ ఉర్దూ వార పత్రికను స్థాపించి నిజాంపాలన వ్యవస్థపై అనేక విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో పత్రిక నిషేధాన్ని ఎదుర్కొంది. 1937లో నిజామాబాద్‌లో జరిగిన ఆరో ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. నిజాంకు వ్యతిరేకంగా రాజకీయ కార్యక్రమాలు ముమ్మరం చేయడంతో 1945లో అరెస్ట్‌ అయ్యారు.


17 ఏళ్ల వయసులోనే..
హైదరాబాద్‌ విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఎన్‌.ఎస్‌.రఘునందనరావు చెప్పుకోతగ్గ పాత్ర పోషించారు. 17 ఏళ్ల చిన్న వయసులోనే క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం కావడానికి జరిగిన పోరాటాల్లో కదం తొక్కారు. నిజాం వ్యతిరేక ఊరేగింపు, ప్రభాత భేరీలు నిర్వహిస్తూ.. వీధుల్లో జాతీయ జెండాలు ఎగురవేశారు. రజాకార్ల ఆగడాలను నిలువరించడానికి బస్తీ నిఘా కమిటీలు ఏర్పాటు చేశారు. పోలీసుల లాఠీఛార్జీల్లో గాయపడ్డారు. అరెస్టును పసిగట్టి చాకచక్యంగా తప్పించుకున్నారు. అజ్ఞాత యోధునిగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తూ... ఆయుధాలు సేకరించి సరిహద్దు పోరాట కేంద్రాలకు చేరవేసేవారు.


తుపాకీ పేల్చి తప్పించుకున్నాడు..
సికింద్రాబాద్‌ లాలాపేటకు చెందిన చెట్టి లక్ష్మయ్య నిజాం రైల్వేలో పనిచేస్తూ.. 1942 జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. లాలాపేట గ్రామ కావలి ముత్తయ్యను లాలాగూడలో రజాకార్లు చంపి నడిరోడ్డుపై పడేసి ఆ తర్వాత లక్ష్మయ్య ఇంటిపై దాడి చేశారు. రెండు నాటు బాంబులను రజాకార్లపై విసిరి, తుపాకీ పేలుస్తూ తప్పించుకుని సికింద్రాబాద్‌ పారిపోయారు. సాయుధ పోరాటానికి శిక్షణ పొందిన యోధులతో కలిసి పనిచేశారు. వి.బి.రాజు నాయకత్వంలో హైదరాబాద్‌ సంస్థాన విముక్తి కోసం అనేక పోరాటాలు చేశారు.

 

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts