logo

పండుగ వేళా... పాత దుస్తులే..!

నేడేజెండా పండుగ. ఈ రోజుకైనా కొత్త ఏకరూప దుస్తులు వస్తాయని, వాటిని తమ పిల్లలు ధరించి బడికి వెళ్తే సంతోషించాలని తల్లిదండ్రులు ఆశించారు. పిల్లలు సైతం ఉత్సాహంగా ఎదురుచూశారు. క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ

Published : 15 Aug 2022 03:16 IST

చిన్నారుల ఆశ నిరాశే..

కూలీ ధర తక్కువని ఆసక్తి చూపని దర్జీలు

రకరకాల దుస్తులతో విద్యార్థులు

న్యూస్‌టుడే, బషీరాబాద్‌: నేడేజెండా పండుగ. ఈ రోజుకైనా కొత్త ఏకరూప దుస్తులు వస్తాయని, వాటిని తమ పిల్లలు ధరించి బడికి వెళ్తే సంతోషించాలని తల్లిదండ్రులు ఆశించారు. పిల్లలు సైతం ఉత్సాహంగా ఎదురుచూశారు. క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ వాతావరణమే కనిపించడంలేదు. ‘పండుగ నాడుకూడా పాత దుస్తులే’ తప్పవనే పరిస్థితి నెలకొంది. ఇందుకు రకరకాల కారణాలను అధికారులు చెబుతున్నారు. దుస్తులను కుట్టేందుకు మహిళా సంఘాల సభ్యులకు బాధ్యతను అప్పగించారు. కుట్టేందుకు ఇంకా సమయం పడుతుందని.. పంద్రాగస్టు నాటికి ఇచ్చే అవకాశం లేదని మహిళా దర్జీలు పేర్కొంటున్నారని అధికారులు వివరిస్తున్నారు. కుట్టుకూలీ ధర త]క్కువగా ఉందంటూ మహిళలు చాలా మంది ముందుకు రావడం లేదని.. ఫలితంగా ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఈ నేపత్యంలో  ‘న్యూస్‌టుడే’ కథనం...

91 వేలకుపైగా విద్యార్థులు
జిల్లాలో 768 ప్రాథమిక, 116 ప్రాథమికోన్నత, 174 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 91,970 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఏకరూప దుస్తులు రెండు జతలు అందజేస్తుంది. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా ఏకరూప దుస్తులు ఇవ్వలేదు. ఈఏడాది బడులు ప్రారంభమై మూడు నెలలు కావస్తోంది. ఈసారి ఏకరూప దుస్తులు కుట్టేందుకు ఇటీవలే స్థానిక మహిళా సంఘాలకు అప్పగించారు. ఒక్కో జతకు రూ.50 చొప్పున చెల్లించేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రైవేటుగా ఒక జత దుస్తులు కుడితే రూ.150-200 వరకు తీసుకుంటున్నామని.. రూ.50మాత్రమే ఇస్తే గిట్టుబాటు కావడం లేదంటూ మహిళలు దుస్తులు కుట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఎలాగైనా పంద్రాగస్టు నాటికి కుట్టి ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు మహిళలపై ఒత్తిడి తెస్తున్నారు.

కుట్టుకూలీ పెంచాలని డిమాండ్‌..
ప్రస్తుతం ఒక జత మాత్రమే విద్యార్థులకు అందజేయనున్నారు. జత కుట్టిన తరువాత రెండోజత కుట్టించి ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక జతకు రూ.50ల కుట్టుకూలీ ధరను కనీసం రూ.150 పెంచి ఇవ్వాలని దర్జీలు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పిల్లలందరికీ ఒక జత కుట్టేందుకు సుమారు రూ.45లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

జిల్లాలో జూలై 27, 28 తేదీల్లో దస్త్రం అందజేశారు. మండలాల వారీగా కేటాయింపులు చేసి కుట్టేందుకు బాధ్యతలు అప్పగించారు. వేల సంఖ్యలోఉన్న పిల్లలకు దుస్తులు కుట్టాలంటే కనీసం నెల పడుతుందని పేర్కొంటున్నారు. పంద్రాస్టు నాటికి విద్యార్థులకు అందించాలని కోరామని, కుట్టడం సాధ్యం కాదని చెబుతున్నారని, ఈనెలాఖరు నాటకి ఇస్తామని దర్జీలు పేర్కొంటున్నారని యాలాల, బషీరాబాద్‌ మండలాల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని