logo

జేఎన్‌టీయూ నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు వచ్చేశాయి.. అయినా రాష్ట్రంలో జేఎన్‌టీయూ పరిధిలో కళాశాలల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. వర్సిటీ అధికారుల అంతులేని నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారనుంది. ప్రైవేటు కళాశాలల్లో వసతులపై

Updated : 15 Aug 2022 06:49 IST

రాష్ట్రంలో నేటికీ ప్రారంభం కాని కళాశాలల తనిఖీలు

22లోగా పూర్తి చేయడం సాధ్యమేనా?

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు వచ్చేశాయి.. అయినా రాష్ట్రంలో జేఎన్‌టీయూ పరిధిలో కళాశాలల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. వర్సిటీ అధికారుల అంతులేని నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారనుంది. ప్రైవేటు కళాశాలల్లో వసతులపై సరైన పరిశీలన లేకుండానే గుర్తింపు (అఫిలియేషన్‌) జారీ చేసే విధానానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జేఎన్‌టీయూ పరిధిలో 141 ఇంజినీరింగ్‌, 70 ఫార్మసీ, 9 ఎంబీఏ/ఎంసీఏ కళాశాలలు కలిపి 220 వరకు ఉన్నాయి. ఎంసెట్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు ఇంజినీరింగ్‌, ఫార్మసీ కలిపి 211 కళాశాలల్లోని సీట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలి. ఇంజినీరింగ్‌ సీట్ల కోసం ఈ నెల 23 నుంచి వచ్చే నెల 2 మధ్య ఆప్షన్లు ఇచ్చేందుకు సాంకేతిక విద్యాశాఖ విద్యార్థులకు అవకాశం కల్పించింది. అంటే 22 రాత్రిలోగా ఇంజినీరింగ్‌ కళాశాలల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావాలి. ఇంత తక్కువ సమయంలో  కళాశాలలను తనిఖీ చేసి.. సరిపడా ఆచార్యులు ఉన్నారా.. ల్యాబ్‌ సౌకర్యాలున్నాయా.. ? అని పరిశీలించడం ఎలా సాధ్యపడుతుందనేది అనుమానంగా మారింది.

డుగడుగునా ఉదాసీనం
కళాశాలలకు గుర్తింపు ఇచ్చేందుకు గత నెలలోనే జేఎన్‌టీయూ దరఖాస్తులు ఆహ్వానించింది. జులై 18తో గడువు ముగిసింది. సాధారణంగా దరఖాస్తు గడువు ముగిసిన రెండు, మూడు రోజుల తర్వాత కళాశాలల తనిఖీలు చేపట్టి గుర్తింపు ఇచ్చే ప్రక్రియను చేపట్టాలి.  దరఖాస్తు గడువు ముగిసి నెల రోజులు కావొస్తున్నా.. నేటికీ క్షేత్ర స్థాయి తనిఖీలు ప్రారంభించలేదు. గతంలో కరోనాను బూచిగా చూపి తనిఖీలు చేయలేదు. ఈసారి కళాశాలలు సజావుగా నడుస్తున్నా.. వాటి పరిశీలన విషయంలో జేఎన్‌టీయూ మేల్కొనలేదని తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషనల్‌, సాంకేతిక విద్యాసంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వి.బాలకృష్ణారెడ్డి విమర్శించారు. తూతూమంత్రంగా కళాశాలల తనిఖీలు ముగిస్తే ల్యాబ్‌ సౌకర్యం, ఆచార్యులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

ఆచార్యుల ర్యాటిఫికేషన్‌ పూర్తి
తనిఖీలు ప్రారంభించే ముందు కళాశాలల్లో ఆచార్యుల నియామకాలకు ర్యాటిఫికేషన్‌ (ఆమోదం) చేస్తారు. శుక్ర, శనివారాల్లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ఆచార్యులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ మినిట్స్‌(ఎస్‌సీఎం) ఇంటర్వ్యూలను జేఎన్‌టీయూ పూర్తి చేసింది. ఆది, సోమవారాల్లో సెలవులున్నాయి. వాస్తవానికి తనిఖీలకు 48 గంటల ముందుగానే సమాచారం ఇవ్వాలి. ఆదివారం సాయంత్రం వరకు కళాశాలలకు వర్తమానం పంపలేదు. ఒకవేళ 16 నుంచి చేపట్టినా.. కేవలం ఆరు రోజుల్లోనే 211 కళాశాలల పరిశీలన పూర్తి చేయాలి. ఇదెలా సాధ్యమనే అభిప్రాయం వినిపిస్తోంది. అంత తక్కువ సమయంలో తనిఖీలు చేసేందుకు జేఎన్‌టీయూ వద్ద సరిపడా పరిశీలన బృందాలు లేవు. దీన్ని బట్టి కళాశాలల గుర్తింపు ఏ స్థాయిలో లోపభూయిష్టం కానుందనేది తేటతెల్లమవుతోంది. కాగా ‘‘ఈ నెల 16 లేదా 17 నుంచి కళాశాలల తనిఖీలు చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తాం. ఆచార్యుల నిష్పత్తి, ల్యాబ్‌ సౌకర్యాలపై ఎక్కువగా దృష్టి పెడతాం’’ అని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ వివరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని