CM KCR: దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామి: సీఎం కేసీఆర్‌

తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలను పురస్కరించుకుని గోల్కొండ

Updated : 15 Aug 2022 14:12 IST

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలను పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం మాట్లాడారు. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిదని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1.25 కోట్ల జెండాలను ప్రతి ఇంటికీ చేర్చామని.. రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని చెప్పారు.

‘‘మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నాం. వారి పోరాటాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. అహింసా మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోంది. దేశానికి రాష్ట్రం దిక్సూచిగా మారింది. ఎన్నో అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటోంది. బలీయమైన ఆర్థికశక్తిగా తెలంగాణ మారింది. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం. సాగులో 11.6 శాతం వృద్ధిరేటు సాధించాం. గొర్రెల పెంపకంలో దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచాం. గ్రామీణ జీవన విధానంలో అగ్రస్థానంలో నిలిచాం. 11.1 శాతం వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రస్థానంలో ఉన్నాం. దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామిగా నిలిచింది’’ అని కేసీఆర్‌ అన్నారు.

సంక్షేమ పథకాలను కేంద్రం అవమానిస్తోంది..

 

‘‘కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తోంది. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపర్చాలని కేంద్రం కుట్ర చేస్తోంది. పన్నుల రూపంలో చెల్లించే దాంట్లో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వాలి. పన్నుల వాటాలను కుదించాలని కేంద్రం యత్నిస్తోంది. సెస్సుల రూపంలో కేంద్రం దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటోంది. 2022-23లో రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయంలో 11.4శాతం గండి కొట్టింది. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ ఆంక్షలు విధిస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం కింద తీసుకునే రుణాల్లో కేంద్రం కోతలు పెడుతోంది. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. కేంద్రం తన బాధ్యత సరిగా నిర్వర్తించట్లేదు. సంక్షేమ పథకాలకు ‘ఉచితాలు’ అని పేరు పెట్టి అవమానిస్తోంది. నిత్యావసరాలపై పన్నులు విధిస్తూ ప్రజలపై భారం మోపుతోంది. కేంద్ర అసమర్థ పాలన వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకాయి. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పడిపోయింది. కేంద్ర పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్వేష రాజకీయాలతో నీచ ఎత్తుగడలకు పాల్పడుతున్నారు’’ అని కేసీఆర్‌ విమర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని