logo

నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తాం..

ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌, చేవెళ్ల నియోజకవర్గాలకు కలిపి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. భవిష్యత్తులో మరింత బాగా పనులు చేసుకుందామన్నారు.

Published : 17 Aug 2022 01:54 IST

తెలంగాణ రాకుంటే ఈ అభివృద్ధి సాధ్యమయ్యేదికాదు
సీఎం కేసీఆర్‌
ఈనాడు, వికారాబాద్‌ - న్యూస్‌టుడే, వికారాబాద్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీ, వికారాబాద్‌ టౌన్‌

ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌, చేవెళ్ల నియోజకవర్గాలకు కలిపి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. భవిష్యత్తులో మరింత బాగా పనులు చేసుకుందామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గతంలో మన వ్యవసాయం ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. కరెంటు లేక, మోటార్లు కాలి, ఎంతగానో గోసపడ్డామన్నారు. వచ్చిన తెలంగాణలో మళ్లీ పాత పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే అన్ని విధాలా చైతన్యం కావాలన్నారు. రూ.60.7 కోట్ల వ్యయంతో నిర్మించిన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జిల్లా పాలనాధికారి నిఖిల తదితరులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. రూ.235 కోట్ల అంచనాతో నిర్మించనున్న వైద్యకళాశాలకు శంకుస్థాపన చేశారు. పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసగించిన ఆయన ప్రధానంగా భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ నుంచి భాజపా కార్యకర్తల వరకు వారి తీరును ఎండగట్టారు. తన బస్సుకు అడ్డుగా వచ్చిన భాజపా కార్యకర్తలు, నేతల వ్యవహారాన్ని ఘాటుగా విమర్శించారు. దమ్ముంటే తెలంగాణకు మంచి జరిగేలా కేంద్రాన్ని ప్రశ్నించాలని వారిని హితవు పలికారు. వైద్యకళాశాల మంజూరు చేసి శంఖుస్థాపన చేయడం, కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించినందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అధ్యక్షతన సాగిన ఈసభలో జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు మహేష్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, కాలె యాదయ్మ, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.


సభా వేదికపై ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు సునీత, ఎమ్మెల్యే ఆనంద్‌, మంత్రి సబితా రెడ్డి,
ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు నరేందర్‌ రెడ్డి, యాదయ్య తదితరులు

వికారాబాద్‌ జిల్లా సాధ్యమయ్యేదా?
తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఆదుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టునూ పూర్తి చేసి సాగు నీళ్లిస్తామన్నారు. సభ ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇళ్లకు వెళ్లిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పథకాల మీద చర్చించాలన్నారు. అడ్డగోలుగా మాట్లాడే వారిని పట్టించుకోవద్దన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు చాలా మంది వస్తారన్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం  అమలుచేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలపై సమగ్రంగా ప్రజలకు వివరించారు.


నూతన కలెక్టరేట్‌లో తన స్థానంలోకూర్చునేముందు కేసీఆర్‌కు అభివాదం చేస్తున్న కలెక్టర్‌ నిఖిల 

తెరాస శ్రేణుల్లో నూతనోత్సాహం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ తెరాస శ్రేణుల్లో ఆసాంతం ఉత్సాహం నింపింది. ప్రధానంగా భాజపాను లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించడంతో సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది. సభికుల్లో ఆలోచన రేకెత్తించే విధంగా ఆద్యంతం ఆసక్తిగా సాగిన ప్రసంగం  ఆకట్టుకుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణ చేశారు. నృత్యాలు, డప్పు వాయిద్యాలతో కార్యకర్తలు, ప్రజలు సభ ప్రాంగణానికి తరలివచ్చారు. సభ ముగిసిన అనంతరం రెండున్నర గంటల పాటు ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది.


పార్టీ కార్యాలయం ప్రారంభించి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్‌ను కూర్చోబెడుతున్న కేసీఆర్‌

ఇవీ... విశేషాలు
* మధ్యాహ్నం 3.15 గంటలకు కేసీఆర్‌ హెలికాప్టర్‌లో వికారాబాద్‌కు చేరుకున్నారు. జిల్లా ఎస్సీ కార్యాలయంలో కేసీఆర్‌  దిగగానే  మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్‌, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మంజుల పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.  
* మధ్యాహ్నం 3.25 గంటలకు ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యే ఆనంద్‌ స్వగృహానికి వెళ్లి తేనేటీ విందు స్వీకరించారు.
* వాతావరంణం చల్లగా ఉండటం, చిరు జల్లులు పడటంతో మళ్లీ వర్షం పడుతుందేమోనని నిర్వాహకులు, నేతలు కొంత కంగారు పడ్డారు.
* జిల్లా సమీకృత భవాన్ని ప్రారంభించారు. అక్కడే జిల్లా వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురి నుంచి అభినందనలు వెల్లడయ్యాయి.
* సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభావేదికపైకి చేరుకున్నారు.
* 5.5 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించారు.దాదాపు 6వేలమంది సభకు తరలి వచ్చారు. సీఎం ప్రసంగం వినేందుకు ఉత్సాహం చూపారు.  
* స్థానిక తండాల వాసులు తమ సమస్యల పరిష్రాఆనికి నిరసన కార్డులు ప్రదర్శించారు.
* సీఎం సభావేదికపైకి వచ్చే వరకు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు పాటలు పాడి సభికులను ఉత్సాహపరిచారు. కొంత సేపటికి వేదిక కింద పడటంతో ఇబ్బంది కలిగింది.
* వర్షం కురిసినా వచ్చిన వారికి ఇబ్బందులు కలుగకుండా నాలుగు షెడ్లు ఏర్పాటు చేశారు.

పట్టణం... గులాబీమయం
కేసీఆర్‌ రాక సందర్భంగా జిల్లా కేంద్రం వికారాబాద్‌ పట్టణ ప్రధాన దారులు గులాబిమయంగా మారాయి. నాయకులు  కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కూడళ్లలో జెండాలు రెపరెపలాడాయి.

సమీకృత భవనంలో చండీ యాగం  
కలెక్టరేట్‌ను కేసీఆర్‌ ప్రారంభించిన అనంతరం వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన చండీయాగంలో ముఖ్యమంత్రితోపాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు,  కలెక్టర్‌, అధికారులు పాల్గొన్నారు.


కార్యక్రమానికి హాజరైన మహిళలు

అభివృద్ధికి నిధులివ్వాలి..  : మెతుకు ఆనంద్‌, ఎమ్మెల్యే
వేదికపై తొలుత వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడారు. గతంలోనే పరిగి, వికారాబాద్‌లకు రెండు డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారన్నారు. వికారాబాద్‌ పట్టణంలో తాను సీఎంతో పాటు వస్తూ రైల్వేవంతెనను చూపించానన్నారు. దానిని బాగు చేసేలా చూడాలన్నారు. అనంతగిరిని అన్ని విధాలుగా పర్యాటకంగా తీర్చిదిద్దాలని కోరారు. వికారాబాద్‌ చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మించాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని