logo

గణేష్‌ విగ్రహాల ఎత్తు విషయంలో ఆంక్షలు లేవు

వినాయక విగ్రహాల ఎత్తు విషయంలో ఎలాంటి షరతులు లేవని, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కోరారు.

Published : 17 Aug 2022 02:38 IST


సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, చిత్రంలో మరో మంత్రి మహమూద్‌ అలీ,
ఎమ్మెల్యే దానం, నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: వినాయక విగ్రహాల ఎత్తు విషయంలో ఎలాంటి షరతులు లేవని, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కోరారు. నగరంలో ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్న గణేష్‌ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి లక్ష, హెచ్‌ఎండీఏ తరఫున లక్ష చొప్పున మొత్తం 6 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. సమావేశంలో హోం మంత్రి మహమూద్‌ అలీ, మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వాస్తవాలను చెప్పడం లేదన్నారు. నిమజ్జనం 9వ తేదీన వినాయకసాగర్‌లోనే ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని