మా ఊరొస్తారా.. కాచుకోండి!

సైబర్‌ నేరస్థులు చెలరేగుతున్నారు. పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులపై దాడులకూ తెగబడుతున్నారు. తాజాగా బిహార్‌ నవాడా జిల్లాలో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులపై తుపాకులతో కాల్పులు జరపటం కలకలం రేకెత్తించింది.

Updated : 17 Aug 2022 10:23 IST

పోలీసులకు సైబర్‌ నేరస్థుల సవాల్‌

ఈనాడు, హైదరాబాద్‌

ఈ ఏడాది 7 నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా సైబర్‌నేరాలపై సుమారు 9,300 కేసులు నమోదైతే 5,000 వరకూ గ్రేటర్‌ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్స్‌లోనివే కావటం పరిస్థితికి అద్దంపడుతోంది.

సైబర్‌ నేరస్థులు చెలరేగుతున్నారు. పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులపై దాడులకూ తెగబడుతున్నారు. తాజాగా బిహార్‌ నవాడా జిల్లాలో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులపై తుపాకులతో కాల్పులు జరపటం కలకలం రేకెత్తించింది. సకాలంగా నవాడా జిల్లా పోలీసులు రావటంతో పెను ప్రమాదం తప్పినట్టు సమాచారం. ఇటీవల బిఘా గ్రామంలో మితిలేష్‌ ప్రసాద్‌ అనే సైబర్‌ నేరస్థుడిని పట్టుకునేందుకు ఆరుగురు సిబ్బందితో ఇన్‌స్పెక్టర్‌ వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన సైబర్‌ నేరస్థులు గాల్లోకి కాల్పులు జరిపారు. సకాలంలో స్థానిక పోలీసులు చేరటంతో పెనుముప్పు తప్పింది. ఇక్కడి పోలీసులు నిరాయుధులుగా వెళ్లినట్టు సమాచారం. గతంలో రాజస్థాన్‌, దిల్లీ, మధ్యప్రదేశ్‌ల్లో ఇదే తరహా ప్రతిదాడులు ఎదురైనా ఇప్పటికీ అదే ఉదాసీనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

తుపాకులతో పహారా.. బిహార్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక, నేపాల్‌ తదితర ప్రాంతాల్లో పది, ఇంటర్‌ తప్పిన యువకులు నేర సామ్రాజ్యాన్ని సృష్టించారు. రూ.వేల సంపాదన నుంచి రూ.కోట్లకు చేరారు. మందీ, మార్బలం తయారు చేసుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు రూ.లక్షల్లో కమీషన్‌ ముట్టజెబుతున్నారు. అరెస్టయితే క్షణాల్లో బెయిల్‌పై బయటకు వచ్చేందుకు వ్యక్తిగత న్యాయవాదులను నియమించుకుంటున్నారు. ఇంత పకడ్బందీగా నేరాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకొనేందుకు పోలీసులు అరకొర జాగ్రత్తలతో వెళ్తున్నారు. విమాన ప్రయాణంలో తుపాకులు తీసుకెళ్లటంపై నిషేధం ఉండటంతో స్థానిక పోలీసుల సహకారం ఉంటుందనే భరోసాతో చేరుతున్నారు. ఒకే ఒక్క స్మార్ట్‌ఫోన్‌ సాయంతో రూ.లక్షలు సంపాదించే అవకాశం ఉండటంతో అక్కడి గ్రామాల్లోని యువకులు మోసాలను వృత్తిగా మార్చుకుంటున్నారు. అక్కడి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఎక్కువ సంపాదన ఉన్న మోసగాళ్లతో పెళ్లి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ ఓ పోలీసు ఉన్నతాధికారి వివరించారు. ప్రాణాలకు తెగించి నిందితులను అరెస్ట్‌ చేసినా.. ఆయా రాష్ట్రాల న్యాయస్థానాలు నిందితులను ట్రాన్సిట్‌ వారెంట్‌పై తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చినా నగరంలోని కొన్ని న్యాయస్థానాలు సైబర్‌ నేరస్థులకు వెంటనే బెయిలిస్తున్నట్టు పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సొమ్మును భారీగా కాజేస్తున్నారంటూ చెబుతున్నా తమ మాటలు పట్టించుకోవట్లేదంటూ వాపోయారు.

అనుభవాలు నేర్వని పాఠాలు

ఇటీవల కర్ణాటక గొలుసు దొంగలను పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ యాదయ్య కత్తిపోట్లకు గురయ్యారు. మాదాపూర్‌ జోన్‌ పరిధిలోని ఓ ఠాణాలోకి వచ్చిన స్థిరాస్తి వ్యాపారి ఇన్‌స్పెక్టర్‌పై దాడికి దిగినట్టు సమాచారం. రెండు నెలల క్రితం బండ్లగూడ జాగీర్‌ వద్ద మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను పట్టుకునేందుకు వెళ్లిన ఎస్‌వోటీ పోలీసులకు ఇదే అనుభవం ఎదురైంది. కళ్లెదుట పోలీసులపై దాడులు జరుగుతున్నా నేర పరిశోధన, అంతరాష్ట్ర దొంగలను పట్టుకునేందుకు వెళ్లే పోలీసులను నిరాయుధులుగా పంపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని