logo

నకిలీ పట్టాలతో.. విదేశాల బాట

బీటెక్‌లో 11 బ్యాక్‌లాగ్‌లు.. అయినా విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే అత్యాశ.. రూ.1.3 లక్షలు వెచ్చించి నకిలీ విద్యార్హతపత్రాలు కొనుగోలు చేశాడు నాచారానికి చెందిన ఓ యువకుడు. అనంతరం అవి ఉస్మానియా వర్సిటీకి పరిశీలనకు రాగా.. నకిలీవని తేలింది. దీనిపై ఓయూ ఠాణాలో కేసు నమోదైంది.

Published : 17 Aug 2022 02:54 IST

వర్సిటీల పరిశీలనలో నెలకు 10-15 పత్రాల గుర్తింపు

ముఠాల కట్టడికి పోలీసుల టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌

* బీటెక్‌లో 11 బ్యాక్‌లాగ్‌లు.. అయినా విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే అత్యాశ.. రూ.1.3 లక్షలు వెచ్చించి నకిలీ విద్యార్హతపత్రాలు కొనుగోలు చేశాడు నాచారానికి చెందిన ఓ యువకుడు. అనంతరం అవి ఉస్మానియా వర్సిటీకి పరిశీలనకు రాగా.. నకిలీవని తేలింది. దీనిపై ఓయూ ఠాణాలో కేసు నమోదైంది.

ఏటా ఓయూ, జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు పెద్దసంఖ్యలో అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు వెళుతుంటారు. ఈ సమయంలో వారి ట్రాన్స్‌స్క్రిప్టులు, ఇతర విద్యార్హత పత్రాలు సమర్పించాలి. తరువాత విదేశాల్లోని విద్యాసంస్థలవారు కన్సల్టెన్సీల సాయంతో పరిశీలన(వెరిఫికేషన్‌) కోసం ఇక్కడికి పంపిస్తున్నారు. జేఎన్‌టీయూ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో వెరిఫికేషన్‌లో నకిలీవిగా గుర్తిస్తున్నారు. నెలకు ఉస్మానియాకు 7-8, జేఎన్‌టీయూకు 12-15 మధ్య నకిలీ విద్యార్హత పత్రాలు వస్తున్నాయి. వీటిని గుర్తించి ఆయా సంస్థలు, కంపెనీలకు తెలియజేస్తున్నారు.

ఒక్కో డిగ్రీ... ఒక్కోరేటు

నకిలీ సర్టిఫికెట్ల తయారీలో వీసా ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కోల్‌కతాల్లో నకిలీ పట్టాల తయారీ ముఠాలు, వ్యక్తులు ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు నిర్ణయించారని పోలీసులు తెలుసుకున్నారు. డిగ్రీకి రూ.2లక్షలు, ఎంబీఏ రూ.2.5లక్షలు, ఇంజినీరింగ్‌కు రూ.4లక్షలుగా నిర్ణయించారు. మరింతమందికి నకిలీ పట్టాలు ఇచ్చేందుకు అక్రమార్కులు ప్రధాన నగరాల్లోని కన్సల్టెంట్ల నిర్వాహకులకు కమీషన్‌ ఇస్తున్నారు. వాస్తవానికి నకిలీ, ఒరిజినల్‌ ధ్రువీకరణపత్రాల మధ్య వాటర్‌ మార్క్స్‌ విషయంలో తేడాలు వస్తుంటాయి. కొన్నాళ్లుగా వాటిని ఒరిజినల్స్‌ పోలినట్లుగా ఉండేలా తయారు చేస్తున్నారు. నకిలీ ధ్రువీకరణపత్రాలను గుర్తించడం వర్సిటీలకు కత్తిమీదసాముగా మారుతోంది.


దృష్టి సారించిన పోలీసులు

రూ.లక్షలు పుచ్చుకొని నకిలీ డిగ్రీ, ఇంజినీరింగ్‌ ధ్రువపత్రాలను ఇస్తున్న విశ్వవిద్యాలయాల గుట్టు ఒక్కోటి బయటకు వస్తోంది. భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌(ఎస్‌ఆర్‌కే) విశ్వవిద్యాలయం కొద్దినెలల క్రితం నకిలీ పట్టాలిచ్చి పోలీసులకు చిక్కగా.. తాజాగా కోల్‌కతాలోని ఓ విద్యాసంస్థ సైబరాబాద్‌ పోలీసులకు దొరికిపోయింది. ఇలా సుమారు ఐదువందలమంది నకిలీ పట్టాలతో అమెరికా, ఐరోపా దేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసుల అంచనా. మూడు కమిషరేట్ల పరిధుల్లో తరచూ ఇవి వెలుగుచూస్తుండడంతో వీటిని నిర్మూలించేందుకు పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలోనే.. ఉత్తరాది రాష్ట్రాల వర్సిటీల నుంచి పట్టాలు పొంది విదేశాలకు వెళ్లినవారి వివరాలను సేకరిస్తున్నారు. వరంగల్‌ నుంచి కూడా పదుల సంఖ్యలో యువకులు, విద్యార్థులు వెళ్లారన్న సమాచారంతో ఆయా దేశాల రాయబార కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. ఇందులో ఎస్‌ఆర్‌కే వర్సిటీ నుంచి అక్రమంగా పట్టాలు పొందిన 25మంది ఎక్కడున్నారన్న అంశంపై పరిశోధిస్తున్నామని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. అమెరికాలో ఉన్నట్టు తేలితే వారు ఇక్కడి వచ్చాక కేసులు నమోదు చేస్తామని, అక్కడే స్థిరపడుంటే దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి సమాచారమిస్తామంటూ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని