logo
Published : 18 Aug 2022 03:05 IST

అద్దె గదులు..అరకొర సౌకర్యాలు !

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇదీ తీరు

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ  

బిజ్వార్‌లో నిర్మాణంలోనే

చిన్నారులు, మహిళల ఆరోగ్యాన్ని తీర్చిదిద్దే లక్ష్యంగా ఏర్పాటైన అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు సమకూరలేదు. దశాబ్దాలు గడుస్తున్నా అద్దె గదుల్లో నెట్టుకురావాల్సిన దుస్థితి. ఇరుకు గదుల్లో కొనసాగడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. సొంత భవనాల నిర్మిస్తే వేలాది మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.  
జిల్లాలోని పందొమ్మిది మండలాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిలో సగానికిపైగా సొంత భవనాలు నిర్మించలేదు. ఏడాది కిందట కొన్నింటిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలోకి తరలించింది. బడుల్లో కేటాయించిన తరగతి గదిలో నిర్వహిస్తున్నారు. మరికొన్నింటిని డ్వాక్రా, సామాజిక భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఉచిత భవనాలు సమకూరనిచోట అద్దె గదులను వినియోగిస్తున్నారు. వీటిల్లో కొన్ని ఇరుకుగా ఉన్నాయి. శౌచాలయాలు, తాగునీరు లేకపోవడంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు ఆయాలకు, పదులసంఖ్యలో లబ్ధిదారులు భోజనం చేసేందుకు అవస్థలు తప్పడంలేదు. ఒకే గదిలో ఆటల సామగ్రి, పుస్తకాలు, పౌష్టికాహారం, వంట సామాగ్రి నిల్వ చేస్తున్నారు. అసౌకర్యాలతో తరచు కేంద్రాలను మార్చుతుండటంతో లబ్ధిదారులు, సిబ్బందికి తలనొప్పిగా మారింది.

సీడీపీఓ కార్యాలయాలు కూడా..
తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాల సీడీపీఓ కార్యాలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. తాండూరు పాత మండల పరిషత్‌ భవనంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడి భవనానికి నెలకు రూ.6,500 అద్దె చెల్లిస్తున్నా సరిపడా గదులు, సమావేశ మందిరం లేకపోవడంతో నెలనెలా సమీక్ష, అవగాహన సమావేశాలను ఆరుబయట నిర్వహించాల్సిన పరిస్థితి. నియోజకవర్గంలోని అంగన్‌వాడీలు కార్యాలయం బయట, సీసీ రహదారులు, చెట్ల కింద దస్త్రాల నమోదు, భోజనాలు చేస్తున్నారు.  
స్థలాలు సమకూర్చినా..  
తాండూరు పట్టణంలో పదకొండు భవనాల నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలాలను కేటాయించారు. భూకేటాయింపులు పూర్తై నెలలు గడిచినా నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం లేదు. ఒక్క సాయిపూర్‌లో మంత్రి సబితారెడ్డి శంకుస్థాపన చేయడంలో పనులు మొదలయ్యాయి. మిగిలిన వాటికి జడ్పీ లేదా డీఎమ్‌ఎఫ్‌టీ నిధులు మంజూరు చేస్తే పనులు కొనసాగించే అవకాశాలున్నాయి. బిజ్వార్‌లో రూ.5లక్షల జడ్పీ నిధులతో చేపట్టిన పనులు స్తంభాల దశలో నిలిచిపోయాయి. అల్లాపూర్‌, కరణ్‌కోటతోపాటు పదులసంఖ్య గ్రామాల్లో నిధులు మంజూరు చేయక నిర్మాణాలు కొనసాగడం లేదు.  


నిధులు మంజూరు చేయాలి
రేణుక, సీడీపీఓ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, తాండూరు.  

సొంత భవనాలు,లేకపోవడంతో అద్దె గదుల్లో నిర్వహించాల్సి వస్తోంది. అనువైన ప్రభుత్వ ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా పరిషత్‌, డీఎమ్‌ఎఫ్‌టీ, ఉపాధిహామీ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తే నిర్మాణాలు కొనసాగించే వీలుంటుంది. సొంత భవనాలు సమకూరితే ప్రతిరోజు పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సౌకర్యంగా ఉంటుంది. పోషకాలతో భోజనం అందించేందుకు, బోధన చేసేందుకు అనువుగా ఉంటుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.  

ఏటా రూ.అరకోటి అద్దె భారం..  
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలను అద్దె గదుల్లో నిర్వహించడం వల్ల సంవత్సరానికి దాదాపు రూ.అరకొటి భారం పడుతోంది. గ్రామాల్లోని అద్దె గదులకు రూ.750, పట్టణాల్లో రూ.3వేల చొప్పున నెలకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా అద్దె గదులకు రూ.50లక్షల దాకా చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సొంత భవనాలు సమకూర్చితే అద్దె రూపంలోని ఆర్థికభారం తప్పనుంది.  

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని