logo

ఈ-వాహన ఛార్జింగ్‌ కేంద్రాలు

పెట్రో, డీజిల్‌ ధరలు తరచూ పెరుగుతున్నాయి. వాహనదారులకు ఇది భారంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తి కనబర్చుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Published : 18 Aug 2022 03:05 IST

సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఏర్పాటుకు కసరత్తు
స్థలాల గుర్తింపు ప్రక్రియ షురూ
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

ఛార్జింగ్‌ కేంద్రం

పెట్రో, డీజిల్‌ ధరలు తరచూ పెరుగుతున్నాయి. వాహనదారులకు ఇది భారంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తి కనబర్చుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వాహనాలు కొనుగోలు చేస్తున్న పలువురు ఇంటి వద్ద ఛార్జింగ్‌ చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఆ ఇబ్బందులు తీరనున్నాయి. టీఎస్‌రెడ్‌కో (తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్‌ వాహన ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించడమే దీనికి కారణం. సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమయింది.
ప్రభుత్వ అధికారులకు లేఖలు
టీఎస్‌రెడ్‌కో ఆధ్వర్యంలో ఈ-వాహన ఛార్జింగ్‌ కేంద్రాలను రెండు జిల్లాల్లో అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇరు జిల్లాల్లో ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఛార్జింగ్‌ స్టేషన్లకు స్థల పరిశీలన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే అనంతరం స్థలాలను ఖరారు చేసి కంపెనీలను ఆహ్వానించనున్నారు. ఇరు జిల్లాల్లో జాతీయ, ప్రధాన రహదారులను ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో స్థాపించనున్నారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ, పంచాయతీరాజ్‌, సహకార, సంక్షేమ శాఖల సహకారంతో ఆయా శాఖల పరిధిలో స్థలాలను గుర్తిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆర్‌అండ్‌బీకి చెందిన ఏడు స్థలాలను ఇప్పటికే ఖరారు చేశారు. కోహీర్‌లోని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ఆవరణలోనూ ఏర్పాటుకు నిర్ణయించారు. వికారాబాద్‌ జిల్లాలో అన్ని శాఖల అధికారులకు ఇప్పటికే లేఖలు రాశారు. హోటళ్లు, దాబాల నిర్వాహకులు ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.
స్థల యజమానులకు ఆదాయం..
ఛార్జింగ్‌ కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంలో స్థలాలకు సంబంధించిన శాఖలు లేదా యజమానులకు కొంతమేర చెల్లించనున్నారు. ఒక్కో యూనిట్‌కు రూపాయి చొప్పున చెల్లించనున్నారు. రాబోయే మూడు నెలల్లో కేంద్రాలు అందుబాటులోకి తెచ్చేందుకు సంబంధిత విభాగం అధికారులు శ్రమిస్తున్నారు. ద్విచక్ర వాహనాల్లో 3 నుంచి 4 యూనిట్లు, కారులో 75 యూనిట్ల వరకు ఛార్జింగ్‌ చేసే అవకాశం ఉండనుంది. బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా అరగంట నుంచి గంటలోపు ఛార్జింగ్‌ చేయనున్నారు. ఆయా చోట్ల అనుమతులు పూర్తయితే 30 కిలో వాట్స్‌, 60 కిలో వాట్స్‌ సామర్థ్యంతో కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.


త్వరలో వినియోగంలోకి వచ్చేలా..
మాణిక్యం, టీఎస్‌ రెడ్‌కో జిల్లా మేనేజర్‌(సంగారెడ్డి, వికారాబాద్‌)

రాబోయే రోజుల్లో విద్యుత్తు వాహనాలు భారీగా పెరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో ఛార్జింగ్‌ కేంద్రాలకు స్థలాలు గుర్తింపు ప్రక్రియ వెంటనే పూర్తి చేస్తాం. ఈ-వాహన ఛార్జింగ్‌ కేంద్రాలు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.


 

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని