logo

తను లేదని.. తనువు వదిలాడు

ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో తండ్రి మరణించాడు. వారం రోజుల కిందట బావ దూరమయ్యాడు. తల్లికి.. సోదరికి ఆ యువకుడే ఆధారం. ఇప్పుడు అతడూ.. ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని తెలిసి గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిల్చాడు.

Published : 18 Aug 2022 03:05 IST

 ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఆపై వివాహం
యువతిని తీసుకెళ్లిన కుటుంబసభ్యులు
ఆమె ఆత్మహత్య చేసుకుందని యువకుడి బలవన్మరణం

శ్రీకాంత్‌

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో తండ్రి మరణించాడు. వారం రోజుల కిందట బావ దూరమయ్యాడు. తల్లికి.. సోదరికి ఆ యువకుడే ఆధారం. ఇప్పుడు అతడూ.. ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని తెలిసి గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిల్చాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకటేష్‌, మంగ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా.. వారం రోజుల క్రితమే ఆమె భర్త మరణించాడు. సోదరుడు శ్రీకాంత్‌(19)తో నేరెడ్‌మెట్‌లోని వినాయక్‌నగర్‌లో ఉంటున్నారు. శ్రీకాంత్‌ ఓ షాపింగ్‌మాల్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి కొద్దికాలం క్రితం రాజేంద్రనగర్‌కు చెందిన యువతి(19) ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించకపోవటంతో జూన్‌ 4న బయటకు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. వినాయక్‌నగర్‌లోనే ఇద్దరూ కొంతకాలం కలిసే ఉన్నారు. విషయం తెలిసి యువతి కుటుంబ సభ్యులు అతడికి వివాహ వయసు 21 రాకుండా పెళ్లిచేసుకోవటం చట్టవిరుద్ధమంటూ రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో శ్రీకాంత్‌కు పెళ్లి వయసు రాలేదని నిర్ధారించి జులై 28న యువతిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను విడదీశారనే మనోవేదనతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం యువతి కుటుంబసభ్యుల ద్వారా శ్రీకాంత్‌కు తెలిసింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న అతడు ప్రేయసి లేకుండా తాను బతకలేనంటూ స్నేహితుల వద్ద కన్నీరు పెట్టుకునేవాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ పలుమార్లు కుటుంబ సభ్యులతో చెప్పాడు. తల్లి, సోదరి ధైర్యం చెబుతూ వచ్చారు. బుధవారం ఉదయం టిఫిన్‌ చేసేందుకు అక్క నుంచి రూ.500 తీసుకొని బయటకు వచ్చాడు. ఉదయం 10గంటల సమయంలో వివేకానగర్‌ సమీపంలోని రోడ్డు పక్కన తోపుడు బండి వద్ద అల్పాహారం తీసుకుంటున్నాడు. అదే సమయంలో అమ్ముగూడ-మౌలాలి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్‌ రైలు రావటాన్ని గమనించాడు. టిఫిన్‌ ప్లేటు అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వెళ్లిన జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకునే సమయంలోనే మృతుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరారు. వారి ద్వారా యువకుడి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు సేకరించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని