logo
Published : 18 Aug 2022 03:05 IST

కదలరు.వదలరు!

పాతికేళ్లుగా ఫిల్లింగ్‌ కేంద్రాల్లో తిష్ఠఅవినీతి, అక్రమాలకు మూలమిదే

రూ.కోట్లలో పక్కదారి.. ఇక ప్రక్షాళన
ఈనాడు, హైదరాబాద్‌

జల మండలికి సంబంధించి షేక్‌పేట ప్రాంతంలోని ఓ ఫిల్లింగ్‌ కేంద్రానికి ఇన్‌ఛార్జిగా ఉంటున్న ఉద్యోగి ఏకంగా 30 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. నారాయణగూడ డివిజన్‌లోని మరో ఫిల్లింగ్‌ స్టేషన్‌కు ఇన్‌ఛార్జిగా ఉంటున్న మరో ఉద్యోగి కూడా 30 ఏళ్లుగా కదలడం లేదు. ఇలా ఒకరు.. ఇద్దరు కాదు.. 50 మందికి పైగా దాదాపు 25-30 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా జల మండలి ఉన్నతాధికారులు ఈ లెక్కలపై ఆరా తీశారు. సాధారణంగా ఒక ఉద్యోగి ఒకేచోట 3 ఏళ్లు కంటే ఎక్కువ పనిచేస్తే అదే విభాగంలో వేరే చోటుకు బదిలీ చేస్తుంటారు. గరిష్ఠంగా 5 ఏళ్లకు మించి ఒకేచోట కొనసాగించరు. జలమండలిలో మాత్రం ఇలాంటి నియమ, నిబంధనలేవీ అమలుకావడం లేదు. ఏళ్లుగా ఒకచోట తిష్ఠ వేసినా బదిలీలు ఉండటం లేదు. రాజకీయ ఇతర పలుకుబడులే ఇందుకు కారణమనే విమర్శలున్నాయి. అనారోగ్యం, ఇతర వ్యక్తిగత సమస్యలుంటే.. మానవీయ కోణంలో ఒకేచోట కొనసాగించినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కొందరికి వ్యక్తిగత సమస్యలు లేకున్నా ఏళ్లుగా ఒకే చోట ఉండటం గమనార్హం. ఇటీవలి కాలంలో జలమండలి ఆధ్వర్యంలో ఫిల్లింగ్‌ కేంద్రాల్లో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ప్రక్షాళన చేపట్టేందుకు ఉన్నతాధికారులు కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో చర్యలు
గ్రేటర్‌ వ్యాప్తంగా జలమండలికి చెందిన 120 ఫిల్లింగ్‌ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 750 ట్యాంకర్లు తిరుగుతుంటాయి. ఇందులో ఉచితంగా నీటి సరఫరాకు 120 ట్యాంకర్ల వరకు కేటాయించారు. ఏదైనా ఒక ప్రాంతంలో కాలుష్య జలాలు సరఫరా అయినప్పుడు, నీటి సమస్య తలెత్తినప్పుడు ఈ ఉచిత ట్యాంకర్లతో ప్రజలకు తాగునీరు అందిస్తారు. ఇక మిగతా ట్యాంకర్లతో అవసరమైనవారికి డబ్బులు తీసుకొని జలమండలి నీటిని సరఫరా చేస్తోంది. గృహ అవసరాలకుగాను 5 వేల లీటర్ల ట్యాంకర్‌ రూ.500, వాణిజ్య అవసరాలైతే రూ.850కి విక్రయిస్తోంది. ఇలా రోజు ఒక ట్యాంకర్‌ 8 ట్రిప్పుల వరకు తిరుగుతుంది. ఈ ట్యాంకర్ల తరలింపులోనే అక్రమాలు జరుగుతున్నాయి. ఫిల్లింగ్‌ స్టేషన్లలో ఇన్‌ఛార్జులు, సిబ్బంది, కిందిస్థాయి అధికారులు కుమ్మక్కై మీటర్ల ట్యాంపరింగ్‌ చేసి వాటిని బయటకు తరలించి విక్రయిస్తున్నారు. వేసవిలో ఈ అక్రమాలు మరింత పెరుగుతున్నాయి. ఇటీవలి మౌలాలి, బోడుప్పల్‌, మహేశ్వరం, మీరాలం ఫిల్లింగ్‌ కేంద్రాల్లో భారీ స్థాయిలో ట్యాంకర్ల దందా బయటపడటంతో జలమండలి సంబంధితులపై క్రిమినల్‌ కేసులు నమోదుచేసింది. ఉచిత ట్యాంకర్లు ప్రజలకు చేరకుండా పరిశ్రమలకు, ఇతర వాణిజ్య అవసరాలకు అమ్ముకుంటున్నారు. ప్రైవేటు వ్యక్తులు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా ఇందులో కీలకంగా మారుతున్నారు. ఏళ్లుగా ఉద్యోగులు, సిబ్బంది ఒకేచోట ఉండటంతో కూడా అక్రమాలకు ఆస్కారం ఉంటోంది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని