logo

నీటి నాణ్యత.. ప్రమాణాలు పెరగాల్సిందే

మెట్రో నగరాల్లో నీటి నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భారత నాణ్యత ప్రమాణాల సంస్థ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా ముంబయి సహా 18 నగరాల్లో కొన్నినెలల క్రితం నీటి నాణ్యతకు సంబంధించి నీటి రంగు, కాలుష్యం, వాసన వంటి 28 ప్రమాణాలను పరీక్షించింది.

Published : 18 Aug 2022 03:32 IST

మెట్రో నగరాలు, పట్టణాలపై కేంద్ర ప్రభుత్వం నజర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో నగరాల్లో నీటి నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భారత నాణ్యత ప్రమాణాల సంస్థ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా ముంబయి సహా 18 నగరాల్లో కొన్నినెలల క్రితం నీటి నాణ్యతకు సంబంధించి నీటి రంగు, కాలుష్యం, వాసన వంటి 28 ప్రమాణాలను పరీక్షించింది. 28 ప్రమాణాలను ముంబయి నగరం అందుకోగా... 27 ప్రమాణాలతో హైదరాబాద్‌ రెండోస్థానంలో నిలిచింది. దిల్లీ కేవలం 9 ప్రమాణాల్లో పాస్‌కాగా... కోల్‌కతా 10 ప్రమాణాలను అందుకుంది.
మూడేళ్ల క్రితం సూచనలు జల్‌జీవన్‌ మిషన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, ఎంపిక చేసిన పట్టాణాల్లో నాణ్యమైన తాగునీటి సరఫరా జరగాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడేళ్ల క్రితం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రకటించారు. రూ.3.50లక్షల కోట్ల నిధులను కేటాయించారు. కరోనాతో పనులు మధ్యలో ఆగినా.. గతేడాది నుంచి చేపట్టాలంటూ కేంద్రం సూచించింది. నిర్దేశించిన పదకొండు ప్రమాణాలను పాటించాలని, నల్లా తిప్పితే నాణ్యమైన నీరు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రమాణాలను మెట్రో నగరాల్లో ముంబయి, హైదరాబాద్‌ మినహా ఏ నగరం అందుకోలేదు. మెట్రోయేతర నగరాల్లో ఒడిశాలోని పూరి పట్టణం మాత్రమే అందుకుంది.

ఈ-కొలీ బ్యాక్టీరియా... లోహాలు
నీటి నాణ్యత ప్రమాణాలను 10500:2012 ప్రకారం పరీక్షిస్తున్నారు. ఆ ప్రకారం తాగునీటిలో బ్యాక్టీరియా, లోహాలు ఉండకూడదు. దిల్లీ, చెన్నై, కోల్‌కతాల్లో నల్లా నీళ్లలో అమ్మోనియా, ఐరన్‌, ఈ-కోలి బ్యాక్టీరియా, కొన్నిచోట్ల స్వల్ప మొత్తంలో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయి. ఇలాగే సరఫరా చేస్తే ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని కేంద్ర అధికారులు హెచ్చరించారు.
కాలుష్య కారకాలిలా..
*దిల్లీ..: అల్యూమినియం, అమ్మోనియా, కాల్షియం, క్లోరైడ్‌, రంగు, ఈ-కొలీ, మెగ్నీషియం, సల్ఫైడ్‌, ఎక్కువగా ఆల్కైన్‌లు, భారం, వాసన వంటివి ఉన్నాయి.
*చెన్నై: అమ్మోనియా, బోరాన్‌, క్లోరైడ్‌, కోలీఫాం, ఫ్లోరైడ్‌, వాసనతో పాటు స్వల్ప మొత్తంలో లోహాలున్నాయి.
* కోల్‌కతా: అల్యూమినియం, బేరియం, కోలీఫాం, ఈ-కొలీ, మెగ్నీషియం, టీడీఎస్‌, ఎక్కువ మోతాదులో ఆల్కైన్‌లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని