BJP: జనగామ జిల్లాకు సర్దార్‌ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి: కె.లక్ష్మణ్‌

జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని.. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేయాలని

Updated : 24 Nov 2022 14:29 IST

హైదరాబాద్‌: జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని.. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేయాలని భాజపా నేత, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ జాతి గర్వపడే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన ఆశాజ్యోతి సర్వాయి పాపన్న అని అన్నారు. నిజాం ఆగడాలపై వీరోచితంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. బడుగుల రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయులు సర్వాయి పాపన్న అని కొనియాడారు. తెలంగాణ గడ్డపై స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమేనని గుర్తుచేశారు.

సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలో నిజాం తరహా పాలనను కొనసాగిస్తున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. ‘‘తెలంగాణ యువత తిరగబడాల్సిన అవసరం ఉంది. భాజపాకు అండగా యువత పోరాటం చేసేందుకు ముందుకు రావాలి. కేసీఆర్‌ కుటుంబ పాలనకు యువత చరమగీతం పాడాలి. కేసీఆర్‌ పాలనను భూస్థాపితం చేయడమే.. సర్వాయి పాపన్నకు ఘనమైన నివాళి అవుతుంది’’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న జీవిత చరిత్ర పుస్తకాన్ని మాజీ ఎంపీ విజయశాంతితో కలిసి లక్ష్మణ్‌ ఆవిష్కరించారు. అంతకుముందు పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఎన్నికైన లక్ష్మణ్‌ను భాజపా శ్రేణులు సన్మానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని