logo

నిరీక్షణకు తెర.. అర్హులకు ఆసరా

ఎన్నికల్లో ఇచ్చిన హామీని తెరాస ప్రభుత్వం నెరవేర్చింది. 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్ల ప్రకటనను ఆచరణలో పెట్టింది. లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో పాతికవేలకుపైగా కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

Updated : 19 Aug 2022 05:14 IST
జిల్లాలో 25,121 కుటుంబాలకు లబ్ధి 
పంపిణీకి సిద్ధంగా గుర్తింపు కార్డులు  
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ, వికారాబాద్‌ టౌన్‌  

న్నికల్లో ఇచ్చిన హామీని తెరాస ప్రభుత్వం నెరవేర్చింది. 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్ల ప్రకటనను ఆచరణలో పెట్టింది. లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో పాతికవేలకుపైగా కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆసరా పింఛన్‌ పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 65 ఏళ్లు ఉండగా, 57 ఏళ్లకు తగ్గిస్తామని 2018 ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. దీంతో మూడున్నర సంవత్సరాలుగా అనేక మంది దరఖాస్తులు సమర్పించారు. పంచాయతీ, మీసేవా కేంద్రాలు, మండల పరిషత్‌ కార్యాలయాల్లో అర్జీలు అందజేశారు. ఎప్పుడు మంజూరు చేస్తారోనని కార్యాలయాల చుట్టూ తిరిగి నిరీక్షించారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగస్టు 15 నుంచి కొత్తవి మంజూరు చేస్తామని ప్రకటించడంతో వారికి ఊరట లభించింది. మంజూరు పత్రాలను సిద్ధం చేసి మండల కేంద్రాలకు తరలించారు. త్వరలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1,056 మందికి గుర్తింపు కార్డులను సైతం అందించేందుకు ముద్రింపజేశారు. వీరందరికి ఈనెల నుంచి నగదు అందించనున్నారు. వద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, బీడి కార్మికులు, గీత, చేనేత, కిడ్నీ బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున దివ్యాంగులకు రూ.3,016 చొప్పున నెలనెలా రూ.6కోట్లకుపైగా నగదును చెల్లించనున్నారు. దీంతో ఆయా లబ్ధిదారులు కుటుంబసభ్యుల వద్ద చేయి చాచకుండా ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు వెసులుబాటు లభించనుంది.

పింఛన్ల పంపిణీ పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఈసారి కొత్తగా  కార్డులను కొత్త పింఛనుదారులకు అందజేయనుంది. పేరు, వయసు, తండ్రి,లేదా భర్తపేరు పింఛన్‌ రకం, పింఛన్‌ ఐడీ, లబ్ధిదారుని చిరునామా, క్యూఆర్‌కోడ్‌ వివరాలు కార్డుపై ఉన్నాయి. పాత లబ్ధిదారులకు కూడా కార్డులు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

బ్యాంకు ఖాతాల్లో జమ: కృష్ణన్‌, డీఆర్‌డీఓ

జిల్లాకు కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. కార్డులు కొన్ని వచ్చాయి. మిగతావి త్వరలోనే రానున్నాయి. అన్ని మండలాలకు మంజూరు అయిన లబ్ధిదారుల వివరాలను పంపించాం. కొత్త పింఛనుదారులకు డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని