logo

సేంద్రియ సాగు.. భలే బాగు

వ్యవసాయంలో నానాటికీ పెరుగుతున్న పెట్టుబడులను నియంత్రించడంతో పాటు నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు అన్నదాతలు కృషి చేస్తున్నారు. కొందరు రైతులు సేంద్రియ ఎరువులను వినియోగిస్తుండగా మరికొందరు జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేస్తున్నారు.

Published : 19 Aug 2022 02:06 IST

పరిగి సమీపాన సాగులో ఉన్న పచ్చిరొట్ట పైరు

న్యూస్‌టుడే, పరిగి, బొంరాస్‌పేట: వ్యవసాయంలో నానాటికీ పెరుగుతున్న పెట్టుబడులను నియంత్రించడంతో పాటు నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు అన్నదాతలు కృషి చేస్తున్నారు. కొందరు రైతులు సేంద్రియ ఎరువులను వినియోగిస్తుండగా మరికొందరు జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేస్తున్నారు.

తాండూరు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో వానాకాలం పంటల సాధారణ సాగు 5,31,500 ఎకరాలు. ఇప్పటివరకు సుమారు 4,01,591 ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. 88,200 ఎకరాల్లో వరి సాగుకు అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం వరి సాగు పనులు ఊపందుకున్నాయి. వరి పంటకు వినియోగించే పచ్చిరొట్ట పైర్ల సాగు గతేడాది 14,150 ఎకరాల్లో ఉండగా ఖరీఫ్‌కు వచ్చే సరికి 20,250 ఎకరాలకు పెరిగింది. వ్యవసాయ శాఖ రాయితీపై విత్తనాలను సరఫరా చేయడంతో వెసులుబాటు కలుగుతోంది. చివరకు జీలుగ విత్తనాలు లభించక కొందరు ఇబ్బందులకు గురయ్యారు. పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇండెంట్‌ పెట్టినా దాదాపు రెట్టింపు స్థాయిలో అవసరం వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రబీకి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామని వారు భరోసా కల్పించారు. ఆర్థిక స్థోమత కలిగిన రైతులు కొందరు విపణిలో తీసుకువచ్చి సాగు చేశారు. ఎకరాకు 25కిలోల విత్తనం అవసరం ఉంటుందని విత్తనం విత్తుకున్నాక రెండు నెలలకు కలియదున్నితే భూసారం పెరుగుతుంది. నేల గుణగణాలు మరింత మెరుగు పడి అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన దిగుబడులు అందుతున్నాయని రైతులు తెలిపారు.

ఖర్చులను తగ్గించేందుకు

అచ్చంగా వ్యవసాయాధారిత ప్రాంతం కావడంతో మొక్కజొన్న, పత్తి, కంది పంటలతో పాటు వరి పంటను కూడా అధికంగానే పండిస్తుంటారు. ఇంధన ధరలు అధికంగా పెరగడంతో సాగు ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. ఫలితంగా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడినట్లవుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న అవగాహనతో పచ్చిరొట్ట పైర్ల సాగు క్రమేపీ విస్తీర్ణం పెరుగుతోందని ప్రతిఏటా రైతులకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి పంట కోత దశకు చేరుకోగానే ముందస్తు చెల్లింపులు కూడా చేసుకుంటున్నారు. ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా వినియోగిస్తున్న బియ్యానికి మార్కెట్లో కన్నా క్వింటాలుకు రూ.250 నుంచి రూ.500 వరకు అధిక ధరలు పలుకుతున్నాయి.

అదనపు భారం తగ్గుతుంది: పెంటయ్య, మెట్లకుంట

ఏటా రెండెకరాల్లో వరి సాగు చేస్తుంటాం. ప్రతిసారి ఎకరాకు 3డీఏపీ ఎరువులు వాడుతుండేది. అలాంటిది జనుము లేదా జీలుగ విత్తనాలను చల్లి నేరుగా దమ్ము చేయడంతో ఒక బస్తా డీఏపీతో సరిపెట్టుకుంటున్నాం. దీంతో అదనపు భారం తగ్గి దిగుబడులు కూడా బాగా వస్తున్నాయి. ప్రతి సీజన్‌లోనూ విత్తనాలు సరిపడా అందుబాటులో ఉంచాలి.

రైతుల్లో మార్పు వస్తోంది: గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

క్షేత్రస్థాయిలో రైతు వేదికల ద్వారా అన్నదాతలకు పచ్చిరొట్ట పైర్ల వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాం. పెట్టుబడులను తగ్గించి నాణ్యమైన దిగుబడులను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలో పోల్చితే రైతుల్లో మార్పు కనిపిస్తోంది. సేంద్రియ, పచ్చిరొట్ట ఎరువులతో నేలకు పోషకాలు నేరుగా అంది దిగుబడులు పెరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని