logo

ఇసుక మేట.. సేద్యానికి కటకట

ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. ఎన్నో ఆశలతో ఖరీఫ్‌ సాగుకు శ్రీకారం చుట్టారు. వారి ఆశలు అడియాశలే అయ్యాయి. లక్షల రూపాయల పెట్టుబడులన్నీ ఎలా తీర్చాలో అని ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లాను వర్షాలు ముంచెత్తడమే

Published : 19 Aug 2022 02:06 IST
జిల్లాలో 34వేల ఎకరాల్లో పంట నష్టం
న్యూస్‌టుడే, పరిగి, పెద్దేముల్‌, వికారాబాద్‌

మన్‌సాన్‌పల్లి వద్ద పొలం దుస్థితి

* ధారూర్‌ మండలం అంతారం గ్రామానికి చెందిన సాయిరెడ్డి కౌలురైతు. రెండెకరాల విస్తీర్ణంలో కంది సాగు చేశారు. విత్తనం వేసినప్పటి నుంచి భారీ వర్షాలు కురిసి, పంట నష్టపోవాల్సి వచ్చింది. ఇందుకోసం వెచ్చించిన రూ.15వేల పెట్టుబడి, శ్రమ చివరకు భూమాత ఒడిలోనే కలిసిపోయాయి.

* వికారాబాద్‌ మండలం మద్గుల్‌చిట్టెంపల్లి చెందిన నర్సింహులుకు నాలుగు ఎకరాల పొలం ఉంది. రెండెకరాల్లో పత్తి, రెండెకరాల్లో కంది, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. ఇప్పటి వరకు అప్పు చేసి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. వర్షాలతో నష్టం వాటిల్లింది. ఇప్పటికే నీళ్లు నిండి మొక్కలు ఎదగడం లేదు.

ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. ఎన్నో ఆశలతో ఖరీఫ్‌ సాగుకు శ్రీకారం చుట్టారు. వారి ఆశలు అడియాశలే అయ్యాయి. లక్షల రూపాయల పెట్టుబడులన్నీ ఎలా తీర్చాలో అని ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లాను వర్షాలు ముంచెత్తడమే ఇందుకు ప్రధాన కారణం. జిల్లా సాధారణ వర్షపాతం 170.7 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటికి 358 మిల్లీ మీటర్ల వర్షం కురువగా, 110 మిల్లీ మీటర్ల వర్షం అధికంగా కురిసింది. దీంతో వందలాది మంది రైతులు రెండో పంట రబీకి ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు చివరి వారం ప్రారంభం కాగానే ఆరుతడి పంటలు సాగు చేయాలని భావిస్తున్నారు. పరిగి, తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 5,31,500 ఎకరాల్లో సాధారణ సాగు ఉండగా ఇప్పటివరకు సుమారు 5,21,650 ఎకరాలు సాగులోకి వచ్చింది. పత్తి, మొక్కజొన్న, జొన్న, మెట్ట పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఆయా రకాల పంటలు కలిపి జిల్లా వ్యాప్తంగా 34వేల ఎకరాలకు పైగా నష్టం జరిగిందని సమాచారం.

శివారెడ్డిపల్లి సమీపంలో ఇలా

వరద ఉద్ధృతికి

కాగ్నా పరీవాహక ప్రాంతంలోని పెద్దేముల్‌, ధారూరు, యాలాల, తాండూరు, బషీరాబాద్‌ మండలాల్లో 10 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఎడతెరిపిలేని వానలతో కోట్‌పల్లి జలాశయం పలుమార్లు అలుగు పారింది. ఎప్పుడు లేని విధంగా కాగ్నా తీర ప్రాంతంలో పంటలు చాలా దెబ్బతిన్నాయి. వరద ఉద్ధృతికి భూమి కోతకు గురై కొట్టుకుపోయాయి. ఇసుక మేటలు వేసింది.  కొన్నిచోట్ల ఆనవాళ్లే లేవు. ప్రధానంగా పత్తి, కంది, మినప, పెసర పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదు. పంటల సాగుకు ఎకరాకు సగటున రూ.10 వేల వరకు ఖర్చు చేశారు. పెద్దేముల్‌ మండలంలోని మన్‌సాన్‌పల్లి, మదనంతాపూరు, రుక్మాపూరు రేగొండి ప్రాంతాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. గాజీపూరు, కందనెల్లి, బుద్దారం వాగుల పరీవాహక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పొలాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. కంది పంట పూర్తి దెబ్బతింది. పత్తి పంటలకు తెగులు సోకింది.

పత్తి పొలంలో ఇసుక మేటలు

రెండో పంటకు అవకాశం లేక

వర్షాలతో దెబ్బతిన్న పంటల స్థానంలో వెంటనే మరో పంటను సాగు చేసుకుందామన్నా నేలలు ఆరడం లేదు. ధారూర్‌, మోమిన్‌పేట, బంట్వారం, తాండూరు, వికారాబాద్‌ ప్రాంతాల్లో పొలాల్లో ఇంకా అక్కడక్కడా నీరు ఇంకిపోలేదు. దీంతో రబీపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం పరిహారాన్ని అందజేయాలని ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు కోరుతున్నారు.

క్షేత్రస్థాయిలో నష్టం అంచనా వేస్తున్నాం - గోపాల్‌, వ్యవసాయ అధికారి

వర్షాలకు జిల్లాలో 34 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు ప్రాథమిక అంచన వేశాం. సుమారు పది వేల ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంటలు నష్ట పోయినట్లు గుర్తించాం. కాగ్నా పరీవాహక ప్రాంతంలో అధికంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. అధికారులను పంపించి నష్టం అంచనా వేయిస్తాం. పొలాల్లో నీరు ఉండటంతో పైర్లు దెబ్బతినే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని