logo

పీహెచ్‌డీలపై ప్రైవేటు బాట

పీహెచ్‌డీల విషయంలో విశ్వవిద్యాలయాలు ప్రైవేటు బాట పడుతున్నాయి. వర్సిటీల పరిధిలో ఉన్న గుర్తింపు పొందిన, స్వయంప్రతిపత్తి కళాశాలల్లోని ఆచార్యులకు పీహెచ్‌డీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రైవేటు

Published : 19 Aug 2022 02:06 IST

ఇంజినీరింగ్‌ ఆచార్యులకు పర్యవేక్షణ బాధ్యతలు
కీలక నిర్ణయం తీసుకున్న జేఎన్‌టీయూ

ఈనాడు, హైదరాబాద్‌: పీహెచ్‌డీల విషయంలో విశ్వవిద్యాలయాలు ప్రైవేటు బాట పడుతున్నాయి. వర్సిటీల పరిధిలో ఉన్న గుర్తింపు పొందిన, స్వయంప్రతిపత్తి కళాశాలల్లోని ఆచార్యులకు పీహెచ్‌డీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పరిశోధన కేంద్రాలున్నచోట పీహెచ్‌డీ స్కాలర్లను కేటాయించాలని నిర్ణయించింది. 20 కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. త్వరలోనే పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు జేఎన్‌టీయూ సన్నాహాలు చేస్తోంది. దాదాపు 205 ఖాళీలు గుర్తించినట్లు తెలిసింది. తాజాగా ఆ వర్సిటీ సైతం ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల ఆచార్యులకు పీహెచ్‌డీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. రీసెర్చ్‌ సెంటర్లు ఉంటే.. ఫుల్‌టైం పీహెచ్‌డీ లేదా అర్హత ఉన్న ఆచార్యులకు పార్ట్‌టైం పీహెచ్‌డీ అభ్యర్థులను కేటాయించనుంది. యూజీసీ-2016 నిబంధనల ప్రకారం అటానమస్‌ కళాశాలలు, వర్సిటీ గుర్తింపు పొందిన నాన్‌ అటానమస్‌ కళాశాలలకు పర్యవేక్షణ బాధ్యతలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆయా కళాశాలల్లో అర్హత ఉన్న ఆచార్యులు దరఖాస్తు చేసుకోవచ్చంటూ జేఎన్‌టీయూ పరిశోధన, అభివృద్ధి విభాగం సంచాలకుడు కె.విజయ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

ఈ విధానంలో ఎక్కువ మంది పీహెచ్‌డీ విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు వీలవుతుందని వర్సిటీ అధికారులు చెబుతుండగా.. ప్రైవేటు కళాశాలల్లో పర్యవేక్షణ సరిగా లేకపోతే పరిశోధనలు గాడి తప్పే అవకాశం ఉందని విద్యార్థులు చెబుతున్నారు. 

నాలుగు అర్హతలు ప్రదానం

పీహెచ్‌డీ స్కాలర్లను పర్యవేక్షించాలంటే నాలుగు ప్రధాన అర్హతలను జేఎన్‌టీయూ నిర్దేశించింది. సంబంధిత ఆచార్యుడు యూజీసీ గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేసి ఉండాలి. వర్సిటీ నుంచి ఆమోదం(ర్యాటిఫికేషన్‌) పొంది కనీసం ఐదేళ్ల బోధన అనుభవం ఉండాలి. పీహెచ్‌డీ పట్టా పొందాక కనీసం రెండేళ్ల బోధన లేదా పరిశోధన అనుభవం ఉండాలి. పీహెచ్‌డీ పూర్తయ్యాక కనీసం ఐదు పరిశోధనపత్రాలు ప్రముఖ జర్నళ్లలో ప్రచురితమవ్వాలి. అలాంటి ఆచార్యులను వచ్చే నెల 8లోపు ఎంపిక చేసి పంపించే బాధ్యత ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు తీసుకోవాలని జేఎన్‌టీయూ ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పీహెచ్‌డీ స్కాలర్ల పర్యవేక్షణకు అనుమతి ఇవ్వనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని