logo

మొక్కలు పెంచుదాం.. రేపటి తరానికదే మేలు

పిల్లల పుట్టిన రోజున మొక్కలు నాటి వారితో పాటు ఎదిగేలా పెంచాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ రోజు మొక్కలను పెంచితే రేపటి తరానికి మంచి ఆక్సిజన్‌, ఆహ్లాదాన్ని ఇవ్వగలమన్నారు.

Published : 19 Aug 2022 02:34 IST
నర్సరీ మేళా ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
పీపుల్స్‌ ప్లాజాలో జరిగిన గ్రాండ్‌ ఉత్సవ్‌ నర్సరీ మేళాలో మొక్కలను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌ రావు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: పిల్లల పుట్టిన రోజున మొక్కలు నాటి వారితో పాటు ఎదిగేలా పెంచాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ రోజు మొక్కలను పెంచితే రేపటి తరానికి మంచి ఆక్సిజన్‌, ఆహ్లాదాన్ని ఇవ్వగలమన్నారు. పెద్దల జ్ఞాపకార్థం మొక్కలు నాటితే ఎప్పటికీ వారిని గుర్తు చేసుకోవచ్చని సూచించారు. నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో గురువారం 12వ గ్రాండ్‌ నర్సరీ మేళాను ఆయన ప్రారంభించారు. పలు స్టాళ్లను సందర్శించి మీడియాతో మాట్లాడారు. మేళాలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు 140 స్టాల్స్‌ ఏర్పాటు చేశారని, వర్టికల్‌, టెర్రస్‌ గార్డెన్‌, పూలు, పండ్ల, బోన్సాయ్‌, ఔషధ తదితర మొక్కలు, పరికరాలు, తొట్లు వంటివి అందుబాటులో ఉన్నాయన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో 12,571 గ్రామాల్లో పండ్లు, పూల మొక్కలతో నర్సరీలు ఏర్పాటు చేశామని, వాటిలో పెంచిన మొక్కలను పంచాయతీల ఆధ్వర్యంలో నాటిస్తున్నామని తెలిపారు. గడిచిన ఏడేళ్లలో 240 కోట్ల మొక్కలు నాటగా 85 శాతం బతికాయని, ఈ ఏడాది మరో 20కోట్ల మొక్కలు నాటుతామని ప్రకటించారు. ఏడేళ్లలో పచ్చదనం 7.6శాతం పెరిగి ప్రస్తుతం 31.6శాతానికి చేరిందని కేంద్ర అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయని వివరించారు. సీఎం కేసీఆర్‌ పిలుపుతో అడవులు పెంచడం ఉద్యమంలా చేపట్టడంతోనే ఇది సాధ్యపడిందన్నారు. అడవుల రక్షణకు కందకాలు తవ్వి పునరుజ్జీవం కల్పిస్తున్నామన్నారు. మేళా నిర్వాహకులు ఖాలిద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. 22వతేదీ వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మేళా ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని