గుట్కా వెనుక ఎవరా ఇద్దరు!

చిల్లర దుకాణాలు.. పాన్‌షాపులు.. తోపుడుబండ్లపై వందలాది ఖైనీ, గుట్కా ప్యాకెట్లు వేలాడుతూ కనిపిస్తాయి. ఇవన్నీ నిషేధిత జాబితాలో ఉన్నా దర్జాగా విక్రయాలు సాగిస్తున్నారు.  మామూళ్లకు అలవాటుపడిన కొందరు పోలీసులు/అబ్కారీ

Updated : 19 Aug 2022 06:11 IST

నగర వ్యాప్తంగా పదుల సంఖ్యలో గోదాములు


పోలీసులు స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, చార్మినార్‌: చిల్లర దుకాణాలు.. పాన్‌షాపులు.. తోపుడుబండ్లపై వందలాది ఖైనీ, గుట్కా ప్యాకెట్లు వేలాడుతూ కనిపిస్తాయి. ఇవన్నీ నిషేధిత జాబితాలో ఉన్నా దర్జాగా విక్రయాలు సాగిస్తున్నారు.  మామూళ్లకు అలవాటుపడిన కొందరు పోలీసులు/అబ్కారీ అధికారుల పుణ్యమాంటూ బహిరంగంగానే సరిహద్దులు దాటిస్తున్నారు.

నటిస్తున్నట్టా.. వదిలేస్తున్నట్టా..

కర్ణాటక, మహారాష్ట్ర కేంద్రంగా సాగుతున్న గుట్కా రవాణాలో నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు.   రాజకీయ, ఆర్థిక పలుకుబడితో వ్యవహారం చక్కదిద్దుతున్నారు. ఈ కార్యకలాపాలకు పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి బినామీగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. సామాజిక సేవలో చురుగ్గా పాల్గొనే ఈ వ్యాపారి పకడ్బందీగా గుట్కా రవాణా సాగిస్తున్నారు. గతంలో పాతబస్తీలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఇద్దరు పోలీసు అధికారులు వీరికి శక్తిమేరకు సహకరించారనే ఆరోపణలున్నాయి. కొన్ని ఠాణాలకు నెలవారీ రూ.2-4 లక్షల వరకూ మామూళ్లు అందుతున్నట్లు తెలిసింది. రాజకీయ పలుకుబడితో పోస్టింగ్స్‌ సంపాదించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు వీరికి బహిరంగంగా సహకరిస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.

పాన్‌మసాలా ‘పుష్ప’లెందరో

గుట్కా సరఫరాలోనూ మాయగాళ్లు ఎత్తులు వేస్తున్నారు. కర్ణాటకలోని బీదర్‌ నుంచి అర్ధరాత్రి దాటాక సరకును నగరానికి చేరవేస్తున్నారు. మినీ లారీలు, ఆటోల్లో సిగరెట్లు, వస్త్రాలు, గృహోపకరణాల చాటున తరలిస్తున్నారు. ఇటీవల ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు రెడీమేడ్‌ దుస్తుల మధ్య గుట్కాను పట్టుకున్నారు. ఓ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థ యజమానిని అరెస్ట్‌ చేశారు. పలు ప్రైవేటు రవాణా సంస్థలకూ భాగమున్నట్లు  ఓ పోలీసు అధికారి తెలిపారు.  పాతబస్తీలో ఇద్దరు బినామీలు పాతనేరస్థులు, రౌడీషీటర్ల ద్వారా ఏజెంట్లకు సరకు చేరవేస్తున్నట్టు సమాచారం.

గోదాములున్న ప్రాంతాలు

ఘట్‌కేసర్‌, ఇబ్రహీంపట్నం, భవానీనగర్‌, హసన్‌నగర్‌, మొగల్‌పుర, తలాబ్‌కట్ట, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, తదితర ప్రాంతాల్లో.

మూడు కమిషనరేట్లలో గుట్కా గణాంకాలు

నమోదైన అక్రమ రవాణా కేసులు: 1037
ఒక్క  హైదరాబాద్‌లోనే: 706
మూడేళ్లలో స్వాధీనం చేసుకున్న సరకు: రూ.56 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని