logo

ఎస్కలేటర్‌ దిగుతూ కింద పడిన విద్యార్థులు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రదర్శిస్తున్న ‘గాంధీ’ చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన విద్యార్థులు ఎస్కలేటర్‌ దిగుతూ పడిపోవడంతో 12 మంది విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయురాలు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే..

Published : 19 Aug 2022 02:46 IST

గాంధీ సినిమా ప్రదర్శిస్తున్న బంజారాహిల్స్‌లోని ఆర్‌కే సినీఫ్లెక్స్‌లో ఘటన


విద్యార్థిని పరామర్శిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌: న్యూస్‌టుడే: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రదర్శిస్తున్న ‘గాంధీ’ చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన విద్యార్థులు ఎస్కలేటర్‌ దిగుతూ పడిపోవడంతో 12 మంది విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయురాలు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌ భారతీయ విద్యాభవన్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (విద్యాశ్రమం)కు చెందిన 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ‘గాంధీ’ చిత్రాన్ని చూపించేందుకు గురువారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌లోని పీవీఆర్‌ ఆర్‌కె సినీఫ్లెక్స్‌కు తీసుకొచ్చారు. విద్యార్థులు ఎస్కలేటర్‌ ఎక్కి పైకి వెళ్లాక దిగే సమయంలో 12 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయురాలు కింద పడిపోవడంతో గాయపడ్డారు. వారిని వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఉపాధ్యాయురాలితో పాటు 8 మంది విద్యార్థులను డిశ్ఛార్జి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో శస్త్రచికిత్స నిమిత్తం ఆసుపత్రిలోనే ఉంచామని, ప్రస్తుతం వారికి బాగానే ఉందని ఆసుపత్రి మెడికల్‌ సర్వీసెస్‌ డైరక్టర్‌ పేర్కొన్నారు.  విద్యార్థులకు ఎలాంటి అపాయం లేదని పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌ వెంకటలక్ష్మి తెలిపారు.  సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ ఎస్సై మనోజ్‌ థియేటర్‌లో ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. ఎస్కలేటర్‌ వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదం జరిగిందా? లేక సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒక విద్యార్థిని తడబడటంతో వెనుక ఉన్న విద్యార్థులు దిగలేక ప్రమాదానికి గురయ్యారని కొందరు విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారని ఎస్సై తెలిపారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

మెరుగైన చికిత్స అందించండి: మంత్రి సబిత

ప్రమాదానికి గురైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ను ఆదేశించారు. ఆసుపత్రికి చేరుకుని  విద్యార్థులను పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.  సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సైతం విద్యార్థులను పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని