logo

రూ. 2.70 లక్షలు స్వాధీనం

చేగుంట నాయబ్‌ తహసీల్దారు చంద్రశేఖర్‌ అనిశా వలకు చిక్కాడు. గురువారం మెదక్‌ అనిశా డీఎస్పీ ఆనంద్‌ ఆధ్వర్యంలో దాడి చేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన ప్రకారం..హైదరాబాద్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి కొత్త

Published : 19 Aug 2022 02:46 IST

అనిశా వలలో నాయబ్‌ తహసీల్దారు

చేగుంట, న్యూస్‌టుడే: చేగుంట నాయబ్‌ తహసీల్దారు చంద్రశేఖర్‌ అనిశా వలకు చిక్కాడు. గురువారం మెదక్‌ అనిశా డీఎస్పీ ఆనంద్‌ ఆధ్వర్యంలో దాడి చేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన ప్రకారం..హైదరాబాద్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి కొత్త రఘునాథరెడ్డికి చేగుంట మండలం రాంపూర్‌లో ఎకరం భూమి ఉంది. ధరణిలో నమోదు కాలేదు. ఇందుకోసం తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. నాయబ్‌ తహసీల్దారు వద్దకు వెళ్తే  రూ.5 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. చివరకు రూ.4.50 లక్షలకుఒప్పందం కుదిరింది. ముందుగా రూ.2.70 లక్షలు ఇస్తానని చెప్పడంతో చంద్రశేఖర్‌ సమ్మతించాడు. దీంతో బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. గురువారం నగదు తీసుకొచ్చానని రఘునాథరెడ్డి చెప్పగా.. తన మనిషి  అనిల్‌కుమార్‌ను పంపిస్తానని చంద్రశేఖర్‌ తెలిపారు. మెదక్‌ మార్గంలో ఓ చోట  అనిల్‌కుమార్‌కు డబ్బులు ఇవ్వగానే అక్కడే మాటు వేసిన అనిశా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. చేగుంట తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని నాయబ్‌ తహసీల్దారును అదుపులోకి తీసుకుని విచారించారు. లంచం తీసుకున్నట్లు ఒప్పుకోవడంతో నాయబ్‌ తహసీల్దారు, అనిల్‌కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

అనిశాకు చిక్కిన పాఠ్యపుస్తక ముద్రణాలయం ఏఓ

ఖైరతాబాద్‌: పదోన్నతికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఏఓను అనిశా అధికారులు పట్టుకున్నారు. రామంతాపూర్‌లోని జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తక విక్రయ కార్యాలయ మేనేజర్‌గా పనిచేస్తున్న సిల్వరి భారతికి పదోన్నతి లభించింది. ఉత్తర్వుల పత్రం కోసం ఆమె మింట్‌కాంపౌండ్‌లోని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పత్రం ఇచ్చేందుకు ముద్రణాలయంలో ఏఓ నరేష్‌కుమార్‌ రూ.10వేలు లంచం డిమాండ్‌ చేశాడు. బాధితురాలు అనిశాకు సమాచారం ఇచ్చి గురువారం మధ్యాహ్నం ఆ మొత్తాన్ని ఏఓకు అందజేశారు.  అనిశా అధికారులు నరేష్‌కుమార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని