logo

Hyderabad News: అవినీతి.. అవమానం.. విషాదాంతం

ఆ భార్యభర్తలిద్దరివి ఉన్నత ఉద్యోగాలు. ఆయన ఓయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. ఆమె ఓ మండలానికి తహసీల్దారు. వారికో కుమారుడు. చక్కని జీవితం. కానీ ఒక్క అవినీతి మరక ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది.

Updated : 04 Sep 2022 08:56 IST

తహసీల్దార్‌ సుజాత

ఈనాడు, హైదరాబాద్‌: ఆ భార్యభర్తలిద్దరివి ఉన్నత ఉద్యోగాలు. ఆయన ఓయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. ఆమె ఓ మండలానికి తహసీల్దారు. వారికో కుమారుడు. చక్కని జీవితం. కానీ ఒక్క అవినీతి మరక ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. చివరికి విషాదాంతం చేసింది. తొలుత భర్త ఆత్మహత్య చేసుకోగా.. ప్రస్తుతం ఆమె ఆ బాధతో అనారోగ్యానికి గురై మృతి చెందారు. గతంలో అవినీతి కేసులో అరెస్టు అయి.. సస్పెన్షన్‌లో కొనసాగుతున్న షేక్‌పేట మండలం తహసీల్దార్‌ సీహెచ్‌ సుజాత(46) పంజాగుట్ట నిమ్స్‌ ఆసుపత్రిలో గుండెపోటుతో శనివారం మృతి చెందారు. ఆమె కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం నిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు రక్త క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారించారు. జులైలో కీమోథెరపీ అనంతరం ఇంటికి వెళ్లారు. మళ్లీ ఆరోగ్యం విషమించడంతో గత నెల 12న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స అందిస్తున్నారు. మరోసారి కీమోథెరపీ చేశారు. శనివారం ఉదయం ఒక్కసారిగా ఆమె గుండెపోటుకు గురయ్యారు. ప్రాణాలను నిలిపేందుకు వైద్యులు శ్రమించినా.. ఫలించలేదు. ఆమె ఉదయం 7.30 గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు పేర్కొన్నారు. అంతకుముందు ఆమె డెంగీ, కొవిడ్‌ బారిన కూడా పడినట్లు తెలుస్తోంది. కాగా తొలుత ఆమె మృతిపై కొన్ని ఛానెళ్లు.. సామాజిక మాద్యమాల్లో రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని.. రక్త క్యాన్సర్‌ కారణంగానే మృతి చెందినట్లు నిమ్స్‌ వైద్యులు స్పష్టం చేశారు.

మానసిక వేదనతో అనారోగ్యం పాలు.. షేక్‌పేట తహసీల్దార్‌గా సుజాత విధులు నిర్వహిస్తుండగా 2020లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టుచేశారు. అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా భారీగా నగదు దొరికింది. అధికారులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. అనంతరం ఆమె భర్త, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అజయ్‌కుమార్‌ను కూడా పోలీసులు విచారణకు పిలిచారు. ఆ అవమానం తట్టుకోలేక విచారణకు హాజరుకాకుండానే భవనంపై దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త మరణం.. అవినీతి కేసులో అరెస్టు.. కేసులు.. సస్పెన్షన్‌తో మానసిక వేదనకు గురవడంతో సుజాత అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. వారికి పదో తరగతి చదువుకున్న కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని నిమ్స్‌ నుంచి చిక్కడపల్లిలోని ఆమె నివాసానికి తరలించారు.సుజాత మృతివార్త తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, సిబ్బంది చేరుకొని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని