logo

సమరానికి సర్వం సిద్ధం!

ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

Updated : 24 Sep 2022 10:55 IST

అర్ధరాత్రి దాటేంత వరకూ నడవనున్న మెట్రో రైళ్లు
ఈనాడు, హైదరాబాద్‌


ఉప్పల్‌ మైదానంలో ఏర్పాట్లలో గ్రౌండ్‌ సిబ్బంది

ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా 2500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని పేర్కొన్నారు. శుక్రవారం మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ తదితరులతో కలసి స్టేడియంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సీపీ మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడేళ్ల విరామం తరువాత జరగబోయే మ్యాచ్‌ను వీక్షించేందుకు 40 వేల మందికి పైగా వస్తారని అంచనా వేశామని, ఎటువంటి ఇబ్బందులకు చోటివ్వకుండా హెచ్‌సీఏ(హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌)తో సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకున్నట్టు వివరించారు. గత 20 రోజులుగా స్టేడియంలో వసతులు, గ్యాలరీ తదితర ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. స్టేడియం చుట్టూ 15 కి.మీ. పరిధిలో 3000 కెమెరాలతో నిఘా ఉంచామన్నారు.  ఇండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు, రిఫరీలు శనివారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి వస్తారు. రెండు హోటళ్లలో బస చేస్తారు. క్రీడాకారులు వచ్చినప్పట్నుంచి మ్యాచ్‌ ముగిసి తిరిగి విమానాశ్రయం వెళ్లేంత వరకూ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని సీపీ వివరించారు. 

* స్టేడియం బయట గడ్డి పెరిగి పాములు సంచరిస్తున్నాయి. పట్టుకొనేందుకు స్నేక్‌ క్యాచర్స్‌ సొసైటీ తరఫున కొందరిని అందుబాటులో ఉంచాం. బ్లాక్‌లో టికెట్లు విక్రయించేవారిపైనా నిఘా పెట్టాం. * ఏదైనా ఇబ్బంది తలెత్తితే డయల్‌ 100, 94906 17111కు సమాచారం ఇవ్వాలి.

గేట్‌-1 వీఐపీ పాసులకు మాత్రమే
* వీఐపీ పాసులు కలిగి తార్నాక వైపు నుంచి వచ్చే వాహనదారులు హబ్సిగూడ-ఎన్‌జీఆర్‌ఐ-ఏక్‌మినార్‌ మీదుగా గేట్‌-1లోకి రావాలి. అంబర్‌పేట్‌ వైపు నుంచి వచ్చే వారు దూరదర్శన్‌-రామంతాపూర్‌- నం.8 మార్గంలో చేరాలి. నాగోల్, వరంగల్‌ జాతీయ రహదారి వైపు నుంచి వచ్చే వారు ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌-సర్వే ఆఫ్‌ ఇండియా-ఏక్‌మినార్‌ నుంచి రావాలి.
* హబ్సిగూడ నుంచి ఉప్పల్‌రోడ్‌లో ఏక్‌మినార్‌ ఎడమవైపు నిలపవచ్చు. * ఉప్పల్‌-హబ్సిగూడ వైపు వచ్చే వాహనాలు జెన్‌పాక్ట్‌ సర్వీసెస్‌ రోడ్, హిందూ ఆఫీసు, మెట్రో రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌ ప్రదేశాల్లో ఆపాలి. * ఉప్పల్‌-రామంతాపూర్‌ వైపు వచ్చే వారు రామంతాపూర్‌-ఉప్పల్‌ వైపు ఉన్న సినీ పొలిస్, మోడ్రన్‌ బేకరీ, శక్తి డిటర్జెంట్, డీఎస్‌ఎల్, అవెయా మరియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌(చర్చి) ప్రదేశాల్లో పార్క్‌ చేయొచ్చు.

స్మార్ట్‌ కార్డులు వాడండి
మ్యాచ్‌ కోసం మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అభిమానులు ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా స్టేడియం మెట్రో స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సర్వీసులు నడపనున్నారు. * ఉప్పల్, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులు ఎక్కేందుకు అనుమతిస్తారు. ఇతర స్టేషన్లలో దిగేందుకు అవకాశం ఉంటుంది. * అమీర్‌పేట, జేబీఎస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి ఇతర కారిడార్లలోకి మారేందుకు కనెక్టింగ్‌ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

జింఖానాలో సాఫీగా టికెట్ల విక్రయం
కార్ఖానా, న్యూస్‌టుడే:  జింఖానా మైదానంలో శుక్రవారం టికెట్ల అమ్మకాలు సాఫీగా సాగాయి. పేటీఎంలో బుక్‌ చేసుకున్న వారిని మాత్రమే పోలీసులు మైదానంలోకి అనుమతించారు. నేరుగా టికెట్‌లు కొనుక్కోవడానికి వచ్చిన అభిమానులను లోపలికి అనుమతించలేదు.  ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు టికెట్‌లు విక్రయించారు. గురువారం జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని పోలీసులు పకడ్బందీగా క్యూలైన్‌లను పాటించేలా చూశారు. పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ చూపించిన వారిని లోపలికి అనుమతించారు.

హెచ్‌సీఏ అధ్యక్షుడిపై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు
నారాయణగూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజహరుద్దీన్‌పై బీసీ పొలిటికల్‌ ఐకాస ఛైర్మన్‌ రాచాలా యుగంధర్‌గౌడ్‌.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు చేశారు. అజహరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని.. అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కమిషన్‌ను కోరారు.  క్రీడాభిమానులపై లాఠీఛార్జికి కారకుడు అజహరుద్దీన్‌ అని పేర్కొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని