logo

కొత్త పేర్ల నమోదులో.. ఎడతెగని జాప్యం

రేషన్‌కార్డుల్లో కొత్త పేర్ల నమోదు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది.  గ్రేటర్‌ పరిధిలో ఇప్పటి వరకు 2 లక్షల మంది పేర్ల నమోదు, చిరునామా మార్పులు, తప్పుడు వివరాల సవరణ తదితరాలపై దరఖాస్తులు చేసుకోగా..

Published : 24 Sep 2022 03:33 IST


లక్షలాది మంది దరఖాస్తుదారుల ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: రేషన్‌కార్డుల్లో కొత్త పేర్ల నమోదు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది.  గ్రేటర్‌ పరిధిలో ఇప్పటి వరకు 2 లక్షల మంది పేర్ల నమోదు, చిరునామా మార్పులు, తప్పుడు వివరాల సవరణ తదితరాలపై దరఖాస్తులు చేసుకోగా.. వాటిల్లో 10 శాతం తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 30శాతం దరఖాస్తుల ప్రక్రియ పూర్తవ్వగా.. 60 శాతం నేటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ఇంట్లో కొత్త కోడలు వచ్చినా, పిల్లలు పుట్టినా రేషన్‌కార్డుల్లో వారి పేర్ల నమోదుకు ప్రయత్నించిన వారికి నిరాశే ఎదురవుతోంది. కొన్నేళ్లుగా దరఖాస్తుల స్వీకరణ తప్ప తదుపరి ప్రక్రియకు పౌరసరఫరాలశాఖ అనుమతి లభించడం లేదు. ఏళ్లపాటు మీసేవా, పౌరసరఫరాలశాఖ కార్యాలయాలు తిరుగుతున్నా పని అవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. దీంతో ప్రభుత్వ పథకాలకు, ఉపకారవేతనాలు, ఆరోగ్యశ్రీ సేవలు పొందే విషయంలో ఆటంకం ఏర్పడుతోందన్నారు. హైదరాబాద్‌ జిల్లాలో రేషన్‌ కార్డుల సంఖ్య 6,36,698. మేడ్చల్‌- మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 7.8 లక్షల మంది లబ్ధిదారులున్నారు. పాత రేషన్‌కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్చడానికి వీలుగా పౌరసరఫరాలశాఖకు హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 1,28,205 దరఖాస్తులు అందాయి. అందులో 40,768 కార్డులకు సంబంధించి ప్రక్రియ పూర్తవగా..11,313 దరఖాస్తులను తిరస్కరించింది. మిగిలినవాటిలో 10,788 దరఖాస్తులు పరిశీలన అధికారుల వద్ద, 6,814 ఎమ్మార్వోలు, ఏఎస్‌వోల వద్ద, డీఎస్‌వోల వద్ద 57,200 పెండింగ్‌లో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 50 వేలు, మేడ్చల్‌ జిల్లాలో 40 వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. పాప పుట్టిందని ఏడాది క్రితం మీసేవా ద్వారా పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఉచితంగా వచ్చే బియ్యాన్ని నష్టపోయానని మల్కాజిగిరికి చెందిన సత్యం అనే వ్యక్తి వాపోయారు. మరణించిన వ్యక్తుల పేర్లను వెంటనే తొలగిస్తున్న పౌరసరఫరాలశాఖ, కొత్తగా పేర్ల నమోదు ప్రక్రియలో అలసత్వం ఎందుకు ప్రదర్శిస్తోందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వ్యక్తుల పేర్లు తొలగించడంతో అమ్మా, నాన్నలను కోల్పోయిన చిన్నారులకు రేషన్‌ అందడం లేదనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని