logo

త్వరలో 700 కొత్తబస్సులు

టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌కు 700 కొత్త బస్సులు రానున్నాయి. ప్రతి బస్సుకూ జీపీఎస్‌ పెట్టి వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టం అందుబాటులోకి రానుంది. ముఖ్యమైన స్టాపుల్లో బస్సు ఏ సమయంలో వస్తుందో తెలియజేసే డిజిటల్‌ బోర్డులు పెట్టబోతున్నారు. వీటితోపాటు అందుబాటులోకి రానున్న సేవలను టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ యాదగిరి  వివరించారు.

Published : 24 Sep 2022 03:33 IST

ఆర్టీసీ నష్టాలు భారీగా తగ్గించాం

‘ఈనాడు’తో గ్రేటర్‌ జోన్‌ ఈడీ యాదగిరి

టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌కు 700 కొత్త బస్సులు రానున్నాయి. ప్రతి బస్సుకూ జీపీఎస్‌ పెట్టి వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టం అందుబాటులోకి రానుంది. ముఖ్యమైన స్టాపుల్లో బస్సు ఏ సమయంలో వస్తుందో తెలియజేసే డిజిటల్‌ బోర్డులు పెట్టబోతున్నారు. వీటితోపాటు అందుబాటులోకి రానున్న సేవలను టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ యాదగిరి  వివరించారు.

- ఈనాడు, హైదరాబాద్‌

? ఆర్టీసీకి గతంలో ఎన్నడూ లేనంతగా రాబడి వస్తోంది. గ్రేటర్‌లో జోన్‌ నష్టాలు ఎంత తగ్గాయి?
*
గతంలో రోజుకు రూ.కోటి ఉన్న నష్టం.. ఇప్పుడు రూ.50 లక్షలు, రూ.60 లక్షలకు పరిమితం చేశాం. డీజిల్‌ ధరలు పెరగడం వల్ల నష్టాలు వస్తున్నాయి.. లేకుంటే లాభాలు వచ్చేవి.

? నగరం ఔటర్‌ రింగు రోడ్డు హద్దుగా విస్తరించింది. ఆ మేరకు బస్సులు నడిపే ఆలోచన ఉందా?
*
నగరం నలుమూలలకూ బస్సులు నడుపుతున్నాం. మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, హయత్‌నగర్‌, ఫైనాన్స్‌ డిస్ట్రిక్ట్‌, పటాన్‌చెరు, విమానాశ్రయం ఇలా ఎటువైపు చూసుకున్నా ఔటర్‌ రింగురోడ్డుకు చేరువగానే వెళ్తున్నాయి. ప్రయాణికులు ఉంటే మరిన్ని క్తొత మార్గాలకు సర్వీసులు విస్తరిస్తాం.

? కొత్త బస్సులు, డబుల్‌డెక్కర్‌ అని ఊరిస్తున్నారు.. అవి ఎప్పుడు రోడ్డెక్కుతాయి..?
*
టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌జోన్‌లో ప్రస్తుతం 2850 బస్సులున్నాయి. కొత్త ఏడాది ఆరంభానికి 700 కొత్త బస్సులు గ్రేటర్‌జోన్‌కు తోడవుతున్నాయి. నగరానికి అవసరమయ్యే 6 వేల బస్సులు దిశగా అడుగులు వేస్తున్నాం. డబుల్‌డెక్కర్‌ బస్సుల కోసం టెండర్లు పిలిచాం.. రూట్లు నిర్ణయించాం. 2023లో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నాం.

? బస్సులు సమయానికి నడవడంలేదు. జీపీఎస్‌ పద్ధతిని వినియోగించుకుని సమయపాలన ఎందుకు సాధించడంలేదు.?
* నగరంలో ట్రాఫిక్‌ సమస్య ఉంటోంది. బస్సులు సకాలంలో వెళ్లేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే విమానాశ్రయానికి వెళ్లే బస్సులకు ‘టీఎస్‌ఆర్టీసీ బస్సు ట్రాకింగ్‌ యాప్‌’ను అందుబాటులోకి తెచ్చాం.. అదే మాదిరి సిటీ బస్సులన్నిటికీ త్వరలోనే అమలు చేస్తాం.

? ఎంఎంటీఎస్‌, మెట్రో అనుసంధానంగా కాలనీలకు బస్సులు నడపాలని గతంలో నిర్ణయించారు. మినీ బస్సులు పెడతామన్నారు ఏమైంది?
* 60 మంది ప్రయాణించగలిగే బస్సులను కాలనీల్లో తక్కువ మందికోసం నడపలేం. పాతబస్తీలో మినీ బస్సులు నడిపి నష్టాలను చవి చూశాం.

?బస్సు బేల్లో ఆపట్లేదని, ఫ్రీలెఫ్ట్‌ని పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి?
* బస్టాపుల్లో ఆటోలు తిష్ఠ వేస్తుండడంతో ఇబ్బందులు వస్తున్నాయి. ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు ఆర్టీసీ డ్రైవర్లు పాల్పడితే వారి జీతం నుంచే అపరాధరుసం వసూలు చేస్తున్నాం.

? కొన్ని సమయాల్లో బస్సుల్లో వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. దీన్ని అధిగమించేందుకు చేపడుతున్న చర్యలేంటి?
* ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఉంటోంది. ఆ సమయాల్లో సూపర్‌వైజర్లు ముఖ్యమైన కూడళ్లలో ఉంటూ బస్సులు తిరుగుతున్న తీరును గమనిస్తున్నారు. కళాశాలల యాజమాన్యాలకు లేఖలు రాశాం.. ఒకేసారి వదలకుండా.. గంట తేడాలో విడిచిపెట్టాలని వివరించాం. ఎంతమంది బస్సుల్లో వస్తారో చెబితే.. అందుకనుగుణంగా వాటి సంఖ్య పెంచుతాం. జిల్లాలకు వెళ్లే బస్సులు విద్యార్థులను ఎక్కించుకునేలా చర్యలు తీసుకున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని