logo

గాంధీకి కొత్త హంగులు

పేదలకు నాణ్యమైన సేవలు అందించేందుకు వీలుగా గాంధీ ఆసుపత్రిలో మరిన్ని మౌలిక వసతులు కల్పించారు. చిన్న పిల్లల వ్యాధులకు చికిత్స కోసం పిడియాట్రిక్‌ ఐసీయూ, సర్జరీ ఐసీయూ అందుబాటులోకి తెచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు.

Published : 24 Sep 2022 03:33 IST

కొత్తగా పిడియాట్రిక్‌, సర్జరీ ఐసీయూ


పిడియాట్రిక్‌ ఐసీయూ వార్డును పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి: పేదలకు నాణ్యమైన సేవలు అందించేందుకు వీలుగా గాంధీ ఆసుపత్రిలో మరిన్ని మౌలిక వసతులు కల్పించారు. చిన్న పిల్లల వ్యాధులకు చికిత్స కోసం పిడియాట్రిక్‌ ఐసీయూ, సర్జరీ ఐసీయూ అందుబాటులోకి తెచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ప్రస్తుతం గాంధీలో 1500 పడకలు ఉన్నాయి. నిత్యం 1600-1700 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. సామర్థ్యానికి మించి రోగులు వస్తుండటంతో సేవల్లో జాప్యం జరుగుతోంది. దీనిని నివారించేందుకు మరిన్ని వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఇటీవలే అధునాతన ఎంఆర్‌ఐ యంత్రం ప్రారంభించారు. 3-4 నెలల్లో 1400 స్కానింగ్‌లతో రూ.కోటి విలువైన సేవలు అందించారు. కొత్తగా ఏర్పాటు చేసిన క్యాథ్‌లాబ్‌ ద్వారా 504 చికిత్సలు నిర్వహించారు. త్వరలో అధునాతన ఆల్ట్రా సౌండ్‌ యంత్రాలు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. సూపర్‌స్పెషాలిటీ సేవలకు సంబంధించి 200 పడకలను సిద్ధం చేయనున్నారు. అదేవిధంగా అన్ని అవయవాలు ఒకేచోట మార్పిడి చేసేలా రాష్ట్ర ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కేంద్రం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో 6 నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది. పిల్లలు లేని జంటల కోసం కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రం కూడా సిద్ధమవుతోంది. మూడు నెలల్లో సేవలు ప్రారంభించనున్నారు. మరోవైపు ఆసుపత్రిలో వైరింగ్‌ కోసం రూ.13.55 కోట్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు రూ.14 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని