logo

ముగ్గురు ఘరానా దొంగల ముఠా పట్టివేత

చేతులకు గ్లౌజులు ధరించి, స్క్రూడ్రైవర్లతో అవలీలగా ఇళ్ల తాళాలను తెరిచి చోరీలు చేసే ముగ్గురు సభ్యుల ముఠాను బాచుపల్లి పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. రూ.28 లక్షల విలువైన బంగారు, వెండి నగలతో పాటు నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Published : 25 Sep 2022 03:24 IST

రూ. 28 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

నిజాంపేట, న్యూస్‌టుడే: చేతులకు గ్లౌజులు ధరించి, స్క్రూడ్రైవర్లతో అవలీలగా ఇళ్ల తాళాలను తెరిచి చోరీలు చేసే ముగ్గురు సభ్యుల ముఠాను బాచుపల్లి పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. రూ.28 లక్షల విలువైన బంగారు, వెండి నగలతో పాటు నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌ఛార్జి ఏసీపీ కృష్ణప్రసాద్‌ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ బేగరి వేణు(23), అంజయ్యనగర్‌ నివాసి పడమటింటి భరత్‌కుమార్‌(19), దూలపల్లి అయ్యప్పకాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ పింటూసింగ్‌(20) మిత్రులు. గత ఏప్రిల్‌ నుంచి 12 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం బాచుపల్లి పోలీసులు, బాలానగర్‌ సీసీఎస్‌ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులు ఆటోలో చోరీ సొత్తును విక్రయించడానికి సంగారెడ్డి వైపు వెళ్తూ పట్టుబడ్డారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా తమ నేరాల చిట్టాను విప్పారు. వారి నుంచి ఆటో, 3 టీవీలు, 510 గ్రాముల బంగారు నగలు, 600 గ్రాముల వెండి వస్తువులు, రూ.1.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.


అత్యాచారం కేసులో.. వార్డ్‌బాయ్‌ అరెస్ట్‌

సైదాబాద్‌, న్యూస్‌టుడే: దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మహిళపై అత్యాచారం చేసిన వార్డ్‌బాయ్‌ సందీప్‌(21)ను శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని మలక్‌పేట సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఈనెల 21న ఆసుపత్రిలో ఈ ఘటన జరిగిన విషయం విదితమే.


లక్పతి హత్య కేసులో ఇద్దరి రిమాండ్‌

సైదాబాద్‌, న్యూస్‌టుడే: సెల్‌ఫోన్‌ కోసం చోటుచేసుకున్న ఘర్షణతో తీవ్రంగా గాయపడి మరణించిన నేనావత్‌ లక్పతి(46) కేసులో ఇద్దరు వ్యక్తులకు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సైదాబాద్‌ ఠాణా పరిధి చంపాపేటలో ఈనెల 17న దారుణ సంఘటన జరిగిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో సమీప బంధువులైన మకట్‌లాల్‌(30) డాకూ(27) ఈ దారుణానికి ఒడిగట్టారని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.


అమెరికా అల్లుడిపై వేధింపుల కేసు

పెనమలూరు(విజయవాడ), న్యూస్‌టుడే: అమెరికా అల్లుడిపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కట్నం వేధింపుల కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ సమీపంలోని పోరంకికి చెందిన వంగల శిరీషకు హైదరాబాద్‌కు చెందిన అనిల్‌కుమార్‌ అబ్బరాజుకు 2015లో వివాహమైంది. అతను అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తుండడంతో భార్యను అమెరికా తీసుకెళ్లారు. కొద్దిరోజులకే పుట్టింటికి వెళ్లిపోవాలంటూ వేధించడం ప్రారంభించారు. తిట్టడం, శారీరకంగా వేధిస్తుండడంతో పాటు ఆస్తిపాస్తులు రాయించురావాలంటూ పుట్టింటికి పంపించి వేశారు. ఆమె శనివారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్తపై కేసు నమోదు చేశారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని