logo

కన్నా.. కలత చెందకు

ఏఎస్‌రావునగర్‌కు చెందిన ఓ బాలిక ఇటీవలి వరకు ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివింది. స్కూల్‌ దూరం అవుతోందని భావించిన తల్లిదండ్రులు బాలికను తమ ఇంటికి సమీపంలోని స్కూల్‌కు మార్చారు. అయితే పాత స్కూల్లోనే చదువుకుంటానని పట్టుపట్టింది.

Published : 25 Sep 2022 04:18 IST
ఈనాడు, హైదరాబాద్‌
ఒక్కసారిగా మార్పుతో పిల్లలపై ప్రభావం
ముందుగా సన్నద్ధం చేయాలంటున్న నిపుణులు

ఏఎస్‌రావునగర్‌కు చెందిన ఓ బాలిక ఇటీవలి వరకు ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివింది. స్కూల్‌ దూరం అవుతోందని భావించిన తల్లిదండ్రులు బాలికను తమ ఇంటికి సమీపంలోని స్కూల్‌కు మార్చారు. అయితే పాత స్కూల్లోనే చదువుకుంటానని పట్టుపట్టింది. తల్లిదండ్రులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా బాలిక మాట వినలేదు. చివరికి అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

సాధారణంగా ఒక ప్రాంతం లేదంటే ఒకే ఇంట్లో ఎక్కువ రోజులు నివసించడం వల్ల ఆ ప్రాంతం.. ఆ ఇంటితో ఒక మానసిక బంధం ఏర్పడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఒకే స్కూల్‌లో చిన్నప్పటి నుంచి చదువుకోవడం వల్ల తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో స్నేహ పూర్వక బంధాన్ని అల్లుకుంటాం. టీనేజర్లలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు ఓరిమితో మాట్లాడి పరిస్థితులను వివరించి..పూర్తి అండదండలు అందిస్తే నెమ్మదిగా కోలుకొని సాధారణ పరిస్థితికి వచ్చేస్తారు. అయితే కొందరిలో మాత్రం ఎంతకీ ఈ కలత తీరదని, చివరికి ఆత్మహత్య లాంటి తీవ్ర నిర్ణయాలకు పాల్పడే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో ఒక్కసారిగా వారిపై నిర్ణయాలు రుద్దకుండా.. నెమ్మదిగా సన్నద్ధం చేయాలన్నారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రుల ధోరణి ఎలా ఉండాలనేదానిపై క్లినికల్‌ సైకాలజిస్టు డా.కృష్ణసాహితి కొన్ని సూచనలు, సలహాలు అందిస్తున్నారు.

* కొత్త నిర్ణయాన్ని వెంటనే ఆకళింపు చేసుకోవడాన్ని మెదడు త్వరగా స్వీకరించదు. ఇందుకు 2-6 నెలల సమయం పడుతుంది. పెద్దలకే కాకుండా పిల్లలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. ముందే మానసికంగా సన్నద్ధం చేయడం మంచిది.

* ఆకస్మికంగా ఇళ్లు మారడం...పిల్లలను కొత్త స్కూల్‌లో చేర్పించడం వంటి నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకోవద్దు. ఎందుకు మారాల్సి వస్తోందో రెండు నెలల నుంచే పిల్లలను చెప్పి సన్నద్ధం చేయడం వల్ల నెమ్మదిగా తెలుసుకుంటారు.  

* ఇంట్లో పెంచుకున్న జంతువులు ఆకస్మికంగా దూరమైనా...పెద్దల కంటే పిల్లలు ఎక్కువగా బాధపడుతుంటారు. కొందరు తీవ్ర కుంగుబాటుకు లోనవుతారు. ఆయా జంతువుల జీవిత కాలం.. స్వభావం గురించి వారికి అర్థమయ్యేలా చెప్పాలి.  


* తీవ్ర కలతతో ఉన్నప్పుడు తినకపోవడం, నిరంతరం ఏడవటం, నిద్ర పోకపోవడం, ఇతర పిల్లలతో కలవకపోవడం చేస్తుంటారు. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో ఆ సమాచారాన్ని పెద్దలతో పంచుకునేందుకు కొన్ని సిగ్నల్స్‌ ఇస్తుంటారు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా సైకియాట్రిస్టులను సంప్రదించాలి.

డా.కృష్ణసాహితి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని