logo

కచ్చితంగా సేవాలోపమే..!

ఛార్జీల రద్దు గురించి సమాచారం అడిగితే ఏకంగా టిక్కెట్లు రద్దు చేయడంతో పాటు..ఆ విషయాన్ని చెప్పకుండా ఆర్థిక నష్టం కలిగించిన రెడ్‌ లెటర్‌ హాలిడేస్‌ ప్రయివేటు లిమిటెడ్‌కు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1 జరిమానా విధించింది.

Updated : 26 Sep 2022 04:27 IST

వేర్వేరు కేసుల్లో జరిమానా విధించిన హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఛార్జీల రద్దు గురించి సమాచారం అడిగితే ఏకంగా టిక్కెట్లు రద్దు చేయడంతో పాటు..ఆ విషయాన్ని చెప్పకుండా ఆర్థిక నష్టం కలిగించిన రెడ్‌ లెటర్‌ హాలిడేస్‌ ప్రయివేటు లిమిటెడ్‌కు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1 జరిమానా విధించింది. విమాన టిక్కెట్‌ ధర రూ.84,220, పరిహారం రూ.15వేలు, కేసు ఖర్చులు రూ.10వేలు చెల్లించాలని ఆదేశించింది. సికింద్రాబాద్‌కు చెందిన అజయ్‌రెడ్డి కుటుంబంతో కలిసి ముంబయి నుంచి మారిషస్‌ వెళ్లేందుకు ప్రతివాద సంస్థను ఆశ్రయించి రూ.1,40,000 పంపి టిక్కెట్లు బుక్‌ చేయమని కోరారు. అనంతరం రద్దు చేసుకుంటే నష్టం, రీఫండ్‌పై వివరాల కోసం ఆరాతీయగా ప్రతివాద సంస్థ ప్రతినిధులు ఏకంగా టిక్కెట్లనే రద్దు చేశారు. ఈ సమాచారం చెప్పకపోవడంతో అజయ్‌ మరోసారి టిక్కెట్లు బుక్‌ చేసుకోవాల్సి వచ్చింది.

* రామక్రిష్ణానగర్‌, డీడీకాలనీకి చెందిన ప్రతాప్‌రాజ్‌ కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌ కొన్నిరోజులకే పాడైనా మరమ్మతులు చేయకుండా, సేవల్లో నిర్లక్ష్యం చేసిన లెనోవో గ్రూప్‌ సంస్థకు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 జరిమానా విధించింది. రూ.50,099, 9శాతం రీఫండ్‌ చేయడంతో పాటు, పరిహారం రూ.10వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు చెల్లించాలని ఆదేశించింది.

* మోసపూరిత హామీలతో మభ్యపెట్టినందుకు బేగంపేట్‌లోని కంట్రీక్లబ్‌ హాస్పిటాలిటీ అండ్‌ హాలిడేస్‌కు వినియోగదారుల కమిషన్‌-2 జరిమానా విధించింది. బండ్లగూడ సన్‌సిటీకి చెందిన బి.శ్రీధర్‌ ఇచ్చిన ఫిర్యాదు విచారించి, సాక్ష్యాధారాలు పరిశీలించిన కమిషన్‌ సభ్యత్వ రుసుము రూ.2,02,500, 9శాతం వడ్డీతో రీఫండ్‌ చేయాలని ఆదేశించింది. దీంతో పాటు రూ.20వేలు పరిహారం, రూ.5వేలు కేసు ఖర్చులు ఇవ్వాలని తీర్పునిచ్చింది.

* పుప్పాలగూడకు చెందిన డి.మూర్తికి బీమా క్లెయిమ్‌ చెల్లించకుండా ఇబ్బందిపెట్టిన ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌కు వినియోగదారుల కమిషన్‌-1 జరిమానా విధించింది. ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ రూ.1,29,980, కేసు ఖర్చులు రూ.10వేలు చెల్లించాలని ఆదేశించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన జయరామారావుకు క్లెయిమ్‌ డబ్బు రూ.97,790, పరిహారం రూ.10వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు ఇవ్వాలని ఆదేశించింది.

ఖాతాదారు ప్రమేయం లేకుండా జరిగిన లావాదేవికి సంబంధించిన ఫిర్యాదులు, సేవలపై నిర్లక్ష్యంగా ఉన్నందుకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు వినియోగదారుల కమిషన్‌-1 జరిమానా విధించింది. ముషీరాబాద్‌కు చెందిన బి.మురళి ఫిర్యాదుపై విచారించిన కమిషన్‌...రూ.20వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని