logo

ఇబ్బందులు డబుల్‌

రాజధానిలో వేలాది రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఆరు నెలలుగా ప్రభుత్వం వీటి కోసం ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. దీంతో పేదల సొంతింటి కల నెరవేరడం లేదు.

Updated : 26 Sep 2022 04:44 IST

ఆరు నెలలుగా నిలిచిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం

రూ.400 కోట్ల బకాయి చెల్లించాలంటున్న గుత్తేదారులు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధానిలో వేలాది రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఆరు నెలలుగా ప్రభుత్వం వీటి కోసం ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. దీంతో పేదల సొంతింటి కల నెరవేరడం లేదు.

లక్ష ఇళ్లు మొదలుపెట్టి..

అయిదేళ్ల కిందట హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు సంబంధించి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దాదాపు లక్ష కుటుంబాలకు ఉచితంగా రెండు పడక గదుల ఇళ్లను అపార్టుమెంట్ల రూపంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఇంజినీరింగ్‌ విభాగానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ఒక్కో ఇంటికి రూ.6 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందులో ఒక్కో ఇంటికి రూ.లక్ష వరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. లక్ష ఇళ్లకు రూ.6500 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేసి దాదాపు 20 చోట్ల మురికివాడల్లో నివాసం ఉంటున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టింది. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.నాలుగువేల కోట్లు విడుదల చేసింది. ఇప్పటి వరకు కాస్త అటుఇటుగా 65 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇంకా 35 వేల ఇళ్లలో కొన్ని 80 శాతం, మరికొన్ని 50 శాతం పూర్తయ్యాయి. ఇప్పటి వరకు గుత్తేదారులకు రూ.400 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్క రూపాయి విడుదల చేయపోవడంతో గుత్తేదారులు ఆరునెలలుగా పనులు నిలిపివేశారు. వాటిని చెల్లిస్తేనే పనులు మొదలు పెడతామని అప్పటి వరకు తమపై ఒత్తిడి తీసుకురావద్దని గుత్తేదారులు అధికారులకు చెప్పారు. దీంతో అధికారులు కూడా చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు.

పూర్తవని లబ్ధిదారుల ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: ఇప్పటికే పూర్తయిన ఇళ్లలో 45 వేలు లబ్ధిదారులకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎనిమిది నెలలుగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయక వీటి పంపిణీ మొదలుకాలేదు. దరఖాస్తుదారుల లెక్క తేలిస్తే.. వాటిని పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంటి దరఖాస్తుల్లో రెండు రకాలున్నాయి. మీసేవా ద్వారా వచ్చిన వాటి వివరాలు సవ్యంగా ఉండటంతో వాటి పరిశీలన సగానికిపైగా పూర్తయింది. నేరుగా అధికారులకు అందజేసిన దరఖాస్తులు సైతం బల్దియా వద్ద ఒకటిన్నర లక్ష మేర ఉన్నాయి. వాటిలో చిరునామా, ఫోన్‌ నంబర్ల వివరాలు సక్రమంగా లేకపోవడంతో.. వాటిని పరిశీలించడం సమస్యగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కారణాలతో 6శాతం దరఖాస్తులు పరిస్థితి అయోమయంలో పడింది.

ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అందించిన దరఖాస్తులు: 7లక్షలు

చిరునామా సవ్యంగా లేని, జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి కాదని గుర్తించిన అర్జీలు: 1.5 లక్షలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని