logo

ఊరెళ్తున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త..!

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి అక్టోబరు 9 వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని చాలా మంది పిల్లలకు సెలవులు ఉన్నాయని ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు, తీర్థయాత్రలకు వెళ్లడం సాధారణమే.

Published : 26 Sep 2022 02:40 IST

పిల్లలపైనా కన్నేసి ఉంచాలి

న్యూస్‌టుడే, వికారాబాద్‌

తాళం వేసిన ఇంట్లో జరిగిన చోరీ (పాత చిత్రం)

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి అక్టోబరు 9 వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని చాలా మంది పిల్లలకు సెలవులు ఉన్నాయని ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు, తీర్థయాత్రలకు వెళ్లడం సాధారణమే. గతంలో జరిగిన దాదాపు అన్ని దొంగతనాలు తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోనే జరిగాయన్నది గుర్తుంచుకోవాలి. ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో పిల్లలు బావులు, చెరువులు, గుంతల్లో ఈతకు దిగుతుంటారు. ఈ విషయంలోనూ పర్యవేక్షణ అవసరమని గుర్తుంచుకోవాలి.

ఇంటికి తాళం వేస్తే..: తాళాలు కనిపించేలా వేస్తే దొంగలకు విజిటింగ్‌ కార్డు ఇచ్చినట్లే. అలా కనిపించకుండా తలుపునకు తెర వేయాలి. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను, నగదు ఇళ్లల్లో ఉంచకుండా చూసుకోవాలి. అలాగే పక్కింటివారికి చెప్పి వెళ్లడం, గదిలో, వరండాలో లైటు (విద్యుత్తు దీపం) వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలి. బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు వచ్చి రోజూ చూసి వెళ్లేలా, పగటిపూట లైట్లు ఆర్పి, చీకటి పడగానే మళ్లీ వేసేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి చిరునామాను పోలీస్‌ ఠాణాలో చెబితే రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తారు.

సరదా కాకూడదు ప్రాణాంతకం

పిల్లలు స్నేహితులతో కలిసి పొలం గట్ల వెంబడి, చెరువులు, కుంటల్లోకి వెళ్లి సరదాగా గడపాలని చూస్తారు. పొలం దగ్గర చెట్లు ఎక్కి కిందపడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే నీటితో నిండిన చెరువులు, కుంటల్లో ఈత కొట్టడానికి వెళ్లి లోతు తెలియక, ఈత రాక మృత్యువాత పడ్డ పిల్లల సంఘటనలు జరుగుతుంటాయి. అందుకే పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్లి ఎవరితో ఆటలాడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని గమనించి తగు సలహాలు, సూచనలు చేయాలి.

తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం

ప్రధానంగా అంతర్జాలం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరితో కలివిడిగా ఉంటున్నారా, ఒక్కరే ఫోన్‌తో ఆడుతున్నారా, తోటి పిల్లలతో కలిసి బయటకు వెళ్లాలని చూస్తున్నారా.. వంటి విషయాలను గమనించాలి. - డాక్టర్‌ సందీప్‌, చిన్న పిల్లల వైద్య నిపుణుడు, వికారాబాద్‌

సమాచారం ఇవ్వండి

ఇంటికి తాళం వేసి ఊరెళ్లేవారు తప్పనిసరిగా పోలీస్‌ఠాణాలో వివరాలు చెప్పాలి. ఠాణాకు వచ్చే అవకాశం లేకుంటే ఇంటి చిరునామాను చరవాణి సంఖ్య 94406 27354కు సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్‌), లేదంటే ఫోన్‌ చేసి తెలుపాలి. వారి ఇళ్లపై ప్రత్యేక నిఘా వేసి రాత్రిపూట గస్తీని పెంచుతాం. - శ్రీను, సీఐ, వికారాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని