logo

స్వచ్ఛందంగా ఇస్తే సరే.. ఒత్తిడి చేస్తే చర్యలే

వినియోగదారు సమ్మతం లేకుండా వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ కోసం ఒత్తిడి చేయడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని ఐటీశాఖ పేర్కొంది. ఇలాంటివి పునరావృతం అయితే చర్యలు తప్పవంటూ మలక్‌పేట డెకత్లాన్‌ను

Published : 27 Sep 2022 04:08 IST

 ఫోన్‌ నంబర్ల సేకరణపై ఐటీశాఖ హెచ్చరిక
డెకత్లాన్‌కు షోకాజ్‌ నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: వినియోగదారు సమ్మతం లేకుండా వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ కోసం ఒత్తిడి చేయడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని ఐటీశాఖ పేర్కొంది. ఇలాంటివి పునరావృతం అయితే చర్యలు తప్పవంటూ మలక్‌పేట డెకత్లాన్‌ను హెచ్చరించింది. నగరవాసులకు కొన్ని కాల్‌సెంటర్ల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ చికాకు తెప్పిస్తున్నాయి. వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ ఎక్కడ నుంచి వెళ్లిందో తెలియదు.. కానీ ఉదయం, రాత్రి తేడా లేకుండా వచ్చే ఈ ఫోన్‌కాల్స్‌ ఇబ్బంది పెడుతున్నాయి. నగరంలోని షాపింగ్‌ మాల్‌లు, వాణిజ్య సంస్థల్లో కొనుగోలు చేసే సమయంలో వారు తప్పనిసరి అంటూ తీసుకునే ఫోన్‌ నంబర్లు ఇలా కాల్‌సెంటర్లకు మళ్లుతున్నాయి. ఒక్కోసారి సైబర్‌ కేటుగాళ్లకు ఈ సమాచారం వెళ్తుండటంతో ఎంతో మంది లక్షలాది రూపాయలను పోగొట్టుకుంటున్నారు. అంగట్లో సరకులా వ్యక్తిగత సమాచారాన్ని అమ్మేస్తుండటంతో తలనొప్పులు తప్పడం లేదు. అయితే దీనిపై ఐటీశాఖ సీరియస్‌ అయ్యింది. తాజాగా మలక్‌పేట్‌లోని డెకత్లాన్‌లో షాపింగ్‌ చేసిన తార్నాకకు చెందిన విజయ్‌గోపాల్‌.. బిల్లు చెల్లించే క్రమంలో వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ తప్పనిసరి అంటూ సిబ్బంది ఒత్తిడి చేయడంతో ఆయన ఫిర్యాదు చేశారు. ఇది సెన్సిటీవ్‌ పర్సనల్‌ డాటా లేదా ఇన్ఫర్మేషన్‌ నిబంధనలకు విరుద్ధం అంటూ ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. సదరు సంస్థకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. అయితే కేవలం నోటీసులతో వదిలేయకుండా రూ.25వేల పెనాల్టీ వేస్తే ఇతర సంస్థలు ఈ చర్యలకు పాల్పడవని ఫిర్యాదీ విజయ్‌గోపాల్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని