logo

Hyderabad Metro: అర్ధరాత్రి.. 24 కిలోమీటర్లు.. 31 నిమిషాలు..

గ్రీన్‌ఛానెల్‌ ద్వారా గుండెను తరలించిన హైదరాబాద్‌ మెట్రో మరో ప్రాణానికి అండగా నిలబడింది. ఆదివారం అర్ధరాత్రి ఎల్‌బీనగర్‌ కామినేని ఆసుపత్రి నుంచి 31 కిలోమీటర్లలోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి 24 నిమిషాల వ్యవధిలో సోమవారం గుండెను తరలించిన వైద్యులు

Updated : 27 Sep 2022 07:24 IST

మెట్రో రైలులో గుండె తరలింపు

ఈనాడు, హైదరాబాద్‌, ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: గ్రీన్‌ఛానెల్‌ ద్వారా గుండెను తరలించిన హైదరాబాద్‌ మెట్రో మరో ప్రాణానికి అండగా నిలబడింది. ఆదివారం అర్ధరాత్రి ఎల్‌బీనగర్‌ కామినేని ఆసుపత్రి నుంచి 24 కిలోమీటర్లలోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి 31 నిమిషాల వ్యవధిలో సోమవారం గుండెను తరలించిన వైద్యులు ఓ రోగికి పునర్జన్మ ప్రసాదించారు. గుండె మార్పిడి చేసిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

నల్గొండ జిల్లా మటంపల్లికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి మెదడుకు తీవ్ర గాయం కావడంతో ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయన బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అతని గుండెను సేకరించి జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉన్న రోగికి అమర్చేందుకు గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేయాలని మెట్రో రైల్‌ యాజమాన్యాన్ని సంప్రదించారు. కామినేని ఆసుపత్రి వైద్యులు, ఇతర మెడికోలు అర్ధరాత్రి ఒంటిగంటకు నాగోల్‌లోని మెట్రో స్టేషన్‌కు గుండెను తీసుకొచ్చారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు స్టేషన్‌ వరకు రైలులో తీసుకొచ్చారు. అక్కడే ఉన్న అపోలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అంబులెన్స్‌లో ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆసుపత్రికి చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న 33 ఏళ్ల వ్యక్తికి హాస్పిటల్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌, కార్డియోథోరాసిక్‌, ట్రాన్స్‌ప్లాంట్‌ అండ్‌ మినిమల్‌ యాక్సెస్‌ సర్జన్‌ డా.ఎ.జి.కె.గోఖలే బృందం విజయవంతంగా గుండెను అమర్చింది.

గుండె తరలింపులో సహకరించినందుకు హైదరాబాద్‌ పోలీసులు, గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేసిన ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు అధికారులకు డా.గోఖలే కృతజ్ఞతలు తెలిపారు. మెట్రో లైన్‌ 3 సెక్యూరిటీ అధికారులు, మెట్రో అధికారులు ఎక్కడా అంతరాయం లేకుండా రైలు ప్రయాణించేలా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరిలోనూ ఇలాగే గ్రీన్‌ఛానల్‌ ద్వారా మెట్రోలో గుండెను తరలించిన సంగతి తెలిసిందే. అవసరమైన సమయాల్లో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్‌ఎంఆర్‌ఎవల్‌ ఎండీ కేవీబీ రెడ్డి పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మూడు నెలల క్రితం జీవన్‌దాన్‌లో గుండె మార్పిడి కోసం నమోదు చేసుకున్నారని, రక్తనమూనాలు సరిపోవడంతో గుండె మార్పిడి చేసినట్లు జీవన్‌దాన్‌ ఇన్‌ఛార్జి డా.స్వర్ణలత పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని