logo

అవుటర్‌పై ఉగ్గబట్టుకోవాల్సిందే

అవుటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రయాణిస్తున్నారా.. అయితే ముందే జాగ్రత్త వహించండి. మరుగుదొడ్లకు వెళ్లాలనుకుంటే కష్టమే. అవుటర్‌ దిగేవరకు అంతే సంగతి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల విషయంలో అగచాట్లు తప్పడం లేదు.

Updated : 28 Sep 2022 11:14 IST

ఏటా రూ.500 కోట్ల వరకు టోల్‌ వసూళ్లు

ఇంటర్‌ ఛేంజ్‌ల వద్ద మరుగుదొడ్లు కరవు

అవుటర్‌పైకి వెళ్లేందుకు ఇంటర్‌ఛేంజ్‌లు

ఈనాడు, హైదరాబాద్‌: అవుటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రయాణిస్తున్నారా.. అయితే ముందే జాగ్రత్త వహించండి. మరుగుదొడ్లకు వెళ్లాలనుకుంటే కష్టమే. అవుటర్‌ దిగేవరకు అంతే సంగతి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల విషయంలో అగచాట్లు తప్పడం లేదు. అత్యాధునిక ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించామని హెచ్‌ఎండీఏ గొప్పలు చెప్పుకోవడం తప్పా.. ప్రయాణికులకు కనీస వసతులు కల్పించడంలో ఏళ్లుగా మీనమేషాలు లెక్కిస్తోంది. నగరం చుట్టూ 158 కిలోమీటర్ల పరిధిలో అవుటర్‌ రింగ్‌ రోడ్డు విస్తరించి ఉంది. దీని నిర్వహణ, అభివృద్ధి పనులను హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్‌జీసీఎల్‌) చూస్తోంది. నగరం నుంచి వెళ్లే వాహనాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఈ రహదారిపైకి చేరుకునేందుకు.. కిందకు దిగేందుకు 19 ప్రాంతాల్లో ఇంటర్‌ ఛేంజ్‌లు నిర్మించారు. అవుటర్‌ ఎక్కే ప్రతి వాహనం నుంచి టోల్‌ వసూలు చేస్తున్నారు. ఏటా రూ.500 కోట్లపైనే హెచ్‌ఎండీఏకు వస్తోంది.

కనీస వసతులు లేవు..
అవుటర్‌పైకి ఎక్కిన తర్వాత మళ్లీ ఇంటర్‌ ఛేంజ్‌ వద్దే కిందకు దిగాలి. ఇక్కడే వాహనదారులు, డ్రైవర్లకు మరుగుదొడ్ల్లతో సహా ఇతర సౌకర్యాలు కల్పించాలి. కానీ కనీస వసతులు అందుబాటులో లేవు. టోల్‌బూత్‌ వద్ద ఉన్న మరుగుదొడ్లను అక్కడ పనిచేసే సిబ్బంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. సాధారణ ప్రయాణికులకు వీటిలోకి అనుమతించడం లేదు.

నిత్యం 1.4 లక్షల వాహనాలు
అవుటర్‌ రింగ్‌రోడ్డుపై నిత్యం 1.4 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ట్రక్‌ డ్రైవర్లు నగరంలోకి వచ్చే ముందు కాలకృత్యాలు తీర్చుకొని, కాసేపు సేద తీరి మళ్లీ ప్రయాణం కొనసాగిస్తుంటారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం అవుటర్‌నే ఉపయోగిస్తున్నారు. కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తుంటారు. అత్యవసర సమయంలో మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు. కొన్నిసార్లు ప్రధాన క్యారేజ్‌ వేపైనే వాహనాలను ఆపుతున్నారు.  దగ్గరకు వచ్చే వరకు ముందు వాహనం ఆగి ఉందన్న విషయం తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం పే అండ్‌ యూజ్‌ పద్దతిలోనైనా మరుగుదొడ్లు నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని