logo

తెల్లకోటుకు నల్లమరక

నగర శివారు శంకర్‌పల్లిలోని రవితేజ పిల్లల ఆసుపత్రి. నిత్యం పదుల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇక్కడ అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనే. సరైన అర్హత లేని వారే వైద్యం చేస్తున్నారు. బయోవ్యర్థాలను సరిగా డిస్పోజ్‌ చేయడం లేదు. ఇదే

Updated : 28 Sep 2022 04:19 IST

అర్హత లేకున్నా వైద్యం..  రోగుల ప్రాణాలతో చెలగాటం

వైద్యారోగ్య శాఖ తనిఖీల్లో వెలుగులోకి వాస్తవాలు

ఈనాడు, హైదరాబాద్‌

నగర శివారు శంకర్‌పల్లిలోని రవితేజ పిల్లల ఆసుపత్రి. నిత్యం పదుల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇక్కడ అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనే. సరైన అర్హత లేని వారే వైద్యం చేస్తున్నారు. బయోవ్యర్థాలను సరిగా డిస్పోజ్‌ చేయడం లేదు. ఇదే పట్టణంలోని ఇందిరా పిల్లల దవాఖానాదీ ఇదే ధోరణి. పారిశుద్ధ్యం సరిగా లేదు. వైద్యుల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ సైతం లేదని వైద్యారోగ్య శాఖ తనిఖీల్లో వెల్లడైంది.


షాద్‌నగర్‌లోని అమృత పిల్లల దవాఖానా. ఇక్కడ నిబంధనలు గాలికొదిలేశారు. రిజిస్టర్‌ వైద్యులు అందుబాటులో లేరు. ఏయే సేవలకు ఎంత ఛార్జి చేస్తున్నారనే విషయాలు ఎక్కడా ప్రదర్శించడం లేదు. ఇతరత్రా నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది.

గ్నిమాపక శాఖ అనుమతులుండవు.. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా ఉండదు.. రిజిస్టర్డ్‌ వైద్యులు ఉండరు.. అర్హత లేకపోయినా వైద్యం చేస్తుంటారు.. ఇలా ఒకటేమిటి ప్రైవేటు ఆసుపత్రులలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనే..! కనీస ప్రమాణాలు పాటించకుండా పలు ఆసుపత్రులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ చేపట్టిన తనిఖీల్లో చాలావరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో సౌకర్యాలు, అనుమతులు లేవని తెలుతోంది. ఆయా ఆసుపత్రులకు ‘ఈనాడు’ పరిశీలనలో ధ్రువీకరణలు లేనట్లుగా తేలింది.

గడువు తీరినా..
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిధిలో 4300 ప్రైవేటు ఆసుపత్రులు, స్కాన్‌ సెంటర్లు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, డెంటల్‌ క్లినిక్‌లు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి ఏర్పాటుకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. దీన్ని కొందరు పట్టించుకోవడం లేదు. గడువు ముగిసినా రెన్యువల్‌ చేయించడం లేదు. దీనికితోడు షాద్‌నగర్‌లోని మహాబోధి డయాగ్నస్టిక్‌ కేంద్రంలో చికెన్‌గన్యా, డెంగీ టెస్టు కిట్లు, ఎలక్ట్రోలైట్‌ ప్యాకెట్లు గడువు తీరినా వినియోగిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నా.. ఆయా శాఖలు పట్టించుకోవడం లేదు. అంతిమంగా రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. రెండున్నరేళ్ల కిందట ఎల్బీనగర్‌లోని షైన్‌ పిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఓ పసికందు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గత పదేళ్లలో నగరంలోని ఆసుపత్రులలో చోటుచేసుకున్న నాలుగు ప్రధాన అగ్ని ప్రమాదాలలో ఎనిమిది మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.

కొన్ని క్లినిక్‌లలో ఉల్లంఘనలు ఇలా..

అర్హత ఉన్న వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది ఉండటం లేదు

బయోమెడికల్‌ సర్టిఫికెట్‌ లేదు

అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ లేదు

అగ్నిమాపరికరాలు అమర్చడం లేదు

కాలుష్య నియంత్రణ మండలి ధ్రువీకరణ లేదు

బయోమెడికల్‌ వ్యర్థాల అధ్వానం

ఆయుష్‌ వైద్యులతో అల్లోపతి వైద్యం చేస్తున్నారు.

నాణ్యత ప్రమాణాలపై ప్రధాన దృష్టి
పి.శ్రీనివాస్‌, మేడ్చల్‌ డీఎంహెచ్‌వో

ప్రైవేటు ఆసుపత్రులు, స్కాన్‌ సెంటర్లు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలపై తనిఖీలు కొనసాగిస్తున్నాం. ప్రధానంగా నాణ్యత ప్రమాణాలు, సౌకర్యాలను పరిశీలిస్తున్నాం. చిన్నలోపాలు ఉంటే సవరించుకునేందుకు సమయం ఇస్తాం. అప్పటికీ మారకపోతే సీజ్‌ చేస్తాం. అర్హత లేకుండా వైద్యం చేస్తుంటే ఆయా క్లినిక్‌లు మూసివేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని