logo

రక్షక భటుడే.. గొలుసు దొంగ!

శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ఓ పోలీస్‌ కానిస్టేబులే దొంగగా మారాడు. సాయంత్రం వాకింగ్‌కు వచ్చిన ఓ మహిళ మెడలోంచి బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Published : 28 Sep 2022 02:39 IST

స్థానికులకు దొరికిపోయిన కానిస్టేబుల్‌

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ఓ పోలీస్‌ కానిస్టేబులే దొంగగా మారాడు. సాయంత్రం వాకింగ్‌కు వచ్చిన ఓ మహిళ మెడలోంచి బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి డీఐ రవీందర్‌ తెలిపిన ప్రకారం.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం, పాలవరానికి చెందిన కంటు రమేష్‌(31) కొంతకాలం క్రితం టీఎస్‌ఎస్‌పీ పోలీసు పటాలంలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. కాగా ఇతను పోలీసు శాఖకు ఎటువంటి సమాచారం లేకుండా పారిపోవడంతో 8 నెలలుగా విధుల్లో లేడు. సోమవారం సాయంత్రం కొత్తగూడ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మహిళ కె.రాధా వాకింగ్‌ చేస్తుండగా వెనుక నుంచి వెళ్లిన కానిస్టేబుల్‌ రమేష్‌ ఆమె మెడలో ఉన్న 9 తులాల బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంబడించి కొద్ది దూరంలో పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఈ విషయమై గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్నాచింగ్‌కు పాల్పడిన కానిస్టేబుల్‌ నుంచి పుస్తెలతాడు స్వాధీనం చేసుకొని మంగళవారం అతన్ని రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని